ముందు సీఏఏ గురించి తెలుసుకోండి.. అందులో మతం అంశమే లేదు

ముందు సీఏఏ గురించి తెలుసుకోండి.. అందులో మతం అంశమే లేదు
  • తెలియక.. తెలివి లేక రోడ్డెక్కుతున్నరు
  • చట్టాన్ని వ్యతిరేకిస్తున్నది రాష్ట్రాలు కాదు నేతలే
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌

హైదారాబాద్‌, వెలుగు:

సీఏఏలో మతం అనే అంశమే లేదని, ఈ విషయం తెలియక కొంతమంది, తెలివి లేక ఇంకొందరు పోరాటం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో శుక్రవారం మారియట్‌ హోటల్‌లో నిర్వహించిన ‘‘సీఏఏ -వై ఇండియా నీడ్స్‌ ఇట్‌’’ అనే కార్యక్రమంతో పాటు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారు ముందుగా చట్టం గురించి తెలుసుకోవాలన్నారు.

ఈ చట్టం ఇక్కడ నివసిస్తూ, ఇక్కడే పౌరులుగా ఉంటున్న వారికి వర్తించదన్నారు. ఇండియన్​ సిటిజన్స్​కాని వారికి పౌరసత్వం ఇచ్చేందుకు అనేక క్లాజులు ఉన్నాయని, శరణార్థులుగా పొరుగు దేశాల నుంచి వచ్చి ఉంటున్న వారికోసమే ఈ చట్టమన్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్​మెంట్​ డేటా ప్రకారం 44 లక్షల మంది రెఫ్యూజీలు ఇండియాలో ఉన్నారని, ఇలాంటి సమయంలో హింసకు గురవుతున్న మైనారిటీలను రక్షించే ఉద్దేశంతో పౌరసత్వ సవరణ చట్టం 2019 రూపుదిద్దుకుందన్నారు. ఇండియాలో పుట్టుకతో పౌరసత్వం వస్తుందని, అలా కాకుండా రూల్స్ ప్రకారం విదేశీయులు ఎవరైనా 12 సంవత్సరాలు ఇక్కడ ఉండి దరఖాస్తు చేసుకుంటే సిటిజన్​షిప్​వస్తుందన్నారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీ కూడా ఇలాగే పౌరసత్వం తీసుకున్నారని గుర్తు చేశారు. పాకిస్థాన్​నుంచి వచ్చిన సింగర్​అద్నాన్​సమీకి స్వయంగా మోడీనే సిటిజన్​షిప్​ఇచ్చారన్నారు. రాజ్యాంగం ప్రకారం మతపరమైన కారణాల వల్ల ఎవరికీ సిటిజన్​ షిప్​ ఇవ్వకుండా అడ్డుకునే హక్కు లేదన్నారు.దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నవారి కోసమే ఈ చట్టం అని అన్నారు. దీని ప్రకారం 2014 డిసెంబర్​ 31 తర్వాత పాకిస్థాన్​ నుంచి బంగ్లాదేశ్​ నుంచి  వచ్చే వారు ఏ మతానికి చెందిన వారైనా , హిందువైనా వారు విదేశీయులే అవుతారన్నారు. అంతకుముందు వచ్చిన వారు కనీసం ఐదేండ్లుగా ఇక్కడ ఉంటున్నవారైతే సిటిజన్​షిప్​ తీసుకోవడానికి ఈ చట్టం అనుమతినిస్తుందన్నారు. ఇది ఎంతమాత్రం మతం ప్రాతిపదికన ఏర్పాటు చేసినది కాదన్నారు.

సీఏఏను వ్యతిరేకిస్తున్నది నేతలే

సీఏఏను రాష్ట్రాలు వ్యతిరేకించడం లేదని, కొందరు నేతలు, వ్యక్తులే తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌‌ నేతలకు అసలు వారి పార్టీ చరిత్రే తెలియదన్నారు. రెఫ్యూజీలకు సిటిజన్​షిప్​ఇవ్వాలని మొదటి ప్రధాని నెహ్రూ చెప్పారన్నారు. ఉగాండాలో స్థిరపడిన గుజరాతీలను 1982లో తరిమికొట్టినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వారికి ఇందిరాగాంధీ ప్రభుత్వం పౌరసత్వం కల్పించిందన్నారు. ఉగాండా నుండి వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వగా లేనిది ఇక్కడ కష్టాలు పడుతున్న మైనార్టీలను అక్కున చేర్చుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు.  సీఏఏతో  ఏదో జరిగిపోతుందని భయభ్రాంతులు సృష్టిస్తున్నారని, ప్రజల్ని హింస, ఆందోళన వైపు నడిపిస్తూ తప్పుదోవ పట్టించే మార్గాలు మానుకోవాలని ప్రతిపక్షాలను హెచ్చరించారు. అస్సోం చిన్న రాష్ట్రమని, ఆ రాష్ట్రంలోకి అక్రమ వలసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఉప ఎన్నికల నాటికి అస్సోంలో ఓటర్ల సంఖ్య లక్ష పెరిగిందని, ఇక్కడ సీఏఏ అమలుకు 1971 సంవత్సరాన్ని కటాఫ్‌‌గా పెట్టుకున్నామన్నారు. 1950లో అస్సోంలోకి అక్రమంగా వలసొచ్చిన వారిని పంపేందుకు నెహ్రూ చట్టం తెచ్చారన్నారు. సమావేశంలో డాక్టర్‌‌ టి. హనుమాన్‌‌ చౌదరి, మాజీ ఎంపీ జి. వివేక్‌‌ వెంటకస్వామి, ఎల్‌‌. రాజభాస్కర్‌‌రెడ్డి, డాక్టర్‌‌ బి. దినేశ్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు. ఓయూలో జరిగిన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. శంకర్, హైదరాబాద్ అధ్యక్షులు రావుల కృష్ణ, కార్యదర్శి పి.శ్రీహరి పాల్గొన్నారు.

No Indian Citizens need to worry about CAA: Ram Madhav at a Talk on “CAA-Why India Needs It”