V6 News

డీల్ కుదుర్చుకోకుంటే.. ఇకపై మంచోడిగా ఉండను!

డీల్ కుదుర్చుకోకుంటే.. ఇకపై మంచోడిగా ఉండను!
  •     ఇరాన్ కిల్లింగ్ మెషీన్​ను అంతం చేసే టైం వచ్చింది: ట్రంప్  
  •     నేడు పాకిస్తాన్​లో చర్చలకు నా బృందాన్ని పంపుతున్నా
  •     డీల్  కుదరలేదంటే ఇరాన్​లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలను పేల్చేస్తామని హెచ్చరిక 
  •     ఇజ్రాయెల్​పై ప్రశంసలు
  •     నాటో దేశాల నిజస్వరూపం బయటపడిందని ఫైర్

వాషింగ్టన్: ఇరాన్ వెంటనే తమతో డీల్ కుదుర్చుకోకపోతే ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనానికి నిరసనగా, హార్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆదివారం మరో హెచ్చరిక జారీ చేశారు. ఈసారి ఇరాన్ గనుక ‘మేం ప్రతిపాదించిన న్యాయమైన, సహేతుకమైన డీల్’ కు అంగీకరించకుంటే మాత్రం ‘ఇకపై వారిపట్ల మర్యాదగా ఉండను’ అని ఆయన స్పష్టం చేశారు. ‘హార్మూజ్ జలసంధిలో నిన్న ఇరాన్ కాల్పులు జరిపింది. ఇది మాతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘తాము జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఇటీవల ప్రకటించింది. ఇది విచిత్రంగా ఉంది. ఎందుకంటే మా దిగ్బంధనంతో ఇప్పటికే అది క్లోజ్ అయింది. వారికి తెలియకుండానే వారు మాకు సహాయం చేస్తున్నారు. ఆ మార్గం మూసివేయడం వల్ల మేం కోల్పోయేదేంలేదు. వారే రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు.  

నిజానికి, చాలా నౌకలు ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు లోడ్ చేసుకోవడానికి వెళ్తున్నాయి. ఇదంతా ఎప్పుడూ ‘మొండివాళ్లం’ అనిపించుకోవాలనుకునే ఐఆర్ జీసీ పుణ్యమే!’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘మా ప్రతిపాదనను వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నా. లేకపోతే, ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని ప్రతి పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను, ప్రతి వంతెనను అమెరికా కూల్చివేయబోతోంది. ఇకపై మర్యాదలు ఉండవు! అవి వేగంగా, సులభంగా కూలిపోతాయి. వారు ఒప్పందాన్ని అంగీకరించకపోతే, గత 47 ఏళ్లుగా అమెరికా అధ్యక్షులు ఇరాన్ విషయంలో చేయలేని పనిని నేను చేయడం గౌరవంగా భావిస్తా. ఇరాన్ కిల్లింగ్ మెషీన్ అంతం కావాల్సిన సమయం వచ్చింది!’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాగా, చర్చల కోసం తన ప్రతినిధులు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నారని,  వారు సోమవారం సాయంత్రం అక్కడికి చేరుకుంటారని ట్రంప్ వెల్లడించారు.

ఆ దేశాల నిజ స్వరూపాలు బయటపడ్డయ్.. 

ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయెల్ తమకు గొప్ప మిత్రదేశంగా ఉందని ట్రంప్ ప్రశంసించారు. ‘ప్రజలకు ఇజ్రాయెల్ నచ్చినా నచ్చకపోయినా, వారు అమెరికాకు గొప్ప మిత్రదేశమని నిరూపించుకున్నారు. వారు ధైర్యవంతులు, సాహసవంతులు, విశ్వాసపాత్రులు, తెలివైనవారు. యుద్ధ సమయాల్లో, ఒత్తిడిలో తమ నిజస్వరూపాలను బయటపెట్టుకున్న ఇతరుల్లా (నాటో కూటమి దేశాలను ఉద్దేశించి) కాకుండా ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతోంది. ఎలా గెలవాలో వారికి తెలుసు!’ అని ఆయన పేర్కొన్నారు. 

సీజ్​ఫైర్ గడువు ఇంకో రెండ్రోజులే.. నేడు పాక్​లో చర్చలు జరిగేనా?  

ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం గడువు బుధవారం నాటితో ముగియనుంది. గడువు మరో రెండు రోజులే ఉండగా.. సోమవారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని ట్రంప్ ప్రకటించారు. అయితే, తమ పోర్టులపై అమెరికా దిగ్బంధనం కొనసాగినంత వరకూ చర్చలకు వెళ్లబోమని ఇరాన్ తేల్చిచెప్పినట్టు ఆదివారం తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే తమ పోర్టులను దిగ్బంధించినంతకాలం హార్మూజ్ గుండా ఏ దేశపు నౌకలనూ వెళ్లనివ్వబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతాయా? లేదంటే కాల్పలు విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తారా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది.