క్వారంటైన్​ అక్కర్లే

క్వారంటైన్​ అక్కర్లే
  • విదేశాల నుంచి వచ్చేటోళ్లకు కొత్త గైడ్​లైన్స్​
  • ఫ్లైట్ దిగాక టెస్టులూ అవసరం లేదు 
  • ర్యాండమ్​గా 2% మంది శాంపిళ్లే తీస్కుంటరు 
  • సోమవారం నుంచి అమల్లోకి కొత్త గైడ్​లైన్స్: మాండవీయ  

న్యూఢిల్లీ: కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చేటోళ్లు ఇకపై వారం రోజులు క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఈ మేరకు కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్ సుఖ్  మాండవీయ గురువారం కొత్త గైడ్​లైన్స్​ను విడుదల చేశారు. ఈ నెల14 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఫ్లైట్ దిగాక ప్రయాణికులందరికీ ఆర్టీపీసీఆర్​ టెస్టులు అవసరం లేదని, ర్యాండమ్​గా 2 శాతం మంది నుంచి శాంపిళ్లను తీసుకుంటామని చెప్పారు. శాంపిళ్లు ఇచ్చినోళ్లు కూడా రిజల్ట్​ వచ్చే దాకా వెయిట్​ చేయాల్సిన అవసరం లేదని, ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. పాజిటివ్​ వస్తే ఇప్పటికే ఉన్న కరోనా ప్రొటోకాల్​ ప్రకారం వాళ్లను ఐసోలేట్​ చేసి ట్రీట్​మెంట్​ అందించాలన్నారు. సీపోర్టుల నుంచి వచ్చేటోళ్లకూ ఇవే రూల్స్ వర్తిస్తాయని చెప్పారు. కొత్త రూల్స్ ప్రకారం.. ‘‘ప్రయాణానికి ముందు ఎయిర్ సువిధ పోర్టల్​లో సెల్ఫ్ డిక్లరేషన్​ ఫారం నింపాలి. 14 రోజుల ట్రావెల్​ హిస్టరీని వెల్లడించాలి. ప్రయాణానికి మూడు రోజుల ముందు ఆర్టీపీసీఆర్​టెస్ట్​ నెగెటివ్​ రిపోర్ట్​ను అప్​లోడ్​ చేయాలి. లేదా వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​నూ అప్​లోడ్​ చేయొచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 82 దేశాల వ్యాక్సిన్​ సర్టిఫికెట్లకే ఆ అవకాశం ఉంది”అని మంత్రి తెలిపారు.   
కేసులు తగ్గుతున్నయ్​
దేశంలో కరోనా కేసులతో పాటు యాక్టివ్​ కేసులూ తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 67,084  కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 4,24,78,060కి పెరిగింది. యాక్టివ్​ కేసులు 7,90,789కి తగ్గాయి.  కరోనాతో మరో 1,241 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,06,520కి చేరింది. డైలీ, వీక్లీ పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. డైలీ పాజిటివిటీ రేటు 4.44 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.58 శాతంగా నమోదైంది.  ఇక దేశవ్యాప్తంగా171.28 కోట్ల డోసుల టీకాలు వేశారు.  

ఒమిక్రాన్​ వచ్చినంక 5 లక్షల డెత్స్: డబ్ల్యూహెచ్​వో
ఒమిక్రాన్ వేరియంట్ ఎంటైరనప్పట్నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల కేసులు, 5 లక్షల మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) వెల్లడించింది. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా అంతమంది చనిపోవడం ఆలోచించాల్సిన విషయమని డబ్ల్యూహెచ్​వో ఇన్సిడెంట్​ మేనేజర్​ ఆబ్ది మహ్మద్​ అన్నారు. ఒమిక్రాన్​ ప్రమాదమేమీ కాదనేవాళ్లంతా.. అది వచ్చినప్పట్నుంచి 5 లక్షల మంది చనిపోయారన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఒమిక్రాన్ అనుకున్నంత మైల్డ్ ఏమీ కాదని, అది కూడా ప్రమాదకరమైనదేనని చెప్పారు.