మర్కజ్​ వెళ్లొచ్చినా క్వారంటైన్ చేయనీయని లీడర్

మర్కజ్​ వెళ్లొచ్చినా క్వారంటైన్ చేయనీయని లీడర్

సూర్యాపేట, వెలుగు: మర్కజ్​ వెళ్లి వచ్చిన ఓ ఆర్​ఎంపీని క్వారంటైన్​లో ఉండాలని అధికారులు సూచిస్తే.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి మాత్రం అడ్డుకున్నాడు. దీంతో సదరు ఆర్​ఎంపీ దర్జాగా క్లినిక్​ను ఓపెన్​ చేసి ప్రాక్టీస్​ సాగించాడు. ఆ ఆర్​ఎంపీకి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్​ అని తేలింది. అతడి వద్ద ట్రీట్​మెంట్​కు వచ్చిన 36 మంది  క్వారంటైన్​లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల​లో కలకలం రేపుతోంది.

ఆర్​ఎంపీ నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధి వత్తాసు..

నేరేడుచర్ల  మండల కేంద్రానికి  చెందిన ఆర్​ఎంపీ మార్చిలో ఢిల్లీలోని మర్కజ్​ ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. అదే సమయంలో రాష్ట్రంలో  మర్కజ్​ లింక్​ కరోనా కేసులు ఎక్కువగా నమోదవడం మొదలయ్యాయి. దీంతో స్థానిక అధికారులు నేరెడుచర్లలోని వారి  వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలో ఆర్​ఎంపీ కూడా మర్కజ్​ వెళ్లి వచ్చినట్లు తేలింది. దీంతో క్వారంటైన్​లో ఉండాలని ఆర్​ఎంపీకి అధికారులు సూచించగా..  అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అడ్డుచెప్పాడు. వ్యాధి లక్షణాలు లేనందున క్వారంటైన్​ అవసరం లేదని అధికారులపై ఒత్తడి తెచ్చాడు. దీంతో   అధికారులు ఆర్​ఎంపీని విడిచిపెట్టారు. ఇదే అదునుగా సదరు ఆర్​ఎంపీ నేరెడుచర్లలోని తన క్లినిక్​లో ప్రాక్టీస్​ సాగించాడు. నాలుగురోజుల క్రితం అధికారులు ఆర్​ఎంపీ శాంపిల్స్​ను టెస్టులకు పంపించగా.. ఈ నెల 16న కరోనా పాజిటివ్​ అని తేలింది. ప్రస్తుతం అతడ్ని గాంధీ హాస్పిటల్​లోని ఐసోలేషన్​ వార్డుకు తరలించారు. ఆ ఆర్​ఎంపీ ఎవరెవరికి ట్రీట్​మెంట్​ చేశాడు..? ఎవరెవరిని కలిశాడు? అని  అధికారులు ఆరా తీస్తున్నారు. సుమారు 36 మందికి సదరు ఆర్​ఎంపీ ట్రీట్​మెంట్​ అందించినట్లు గుర్తించారు. వారందరినీ క్వారంటైన్​లో ఉండాలని ఆదేశించారు. ఆ 36 మంది శాంపిల్స్​ను సేకరించి టెస్టుల కోసం పంపించారు. ఒక ఆర్​ఎంపీ నిర్లక్ష్యం, అతడికి ఓ ప్రజాప్రతినిధి వత్తాసు పలకడం.. ఫలితంగా నేరెడుచర్లలో టెన్షన్​ నెలకొంది.