కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్‌లను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణల ఆడియో, వీడియో రికార్డులను సేకరించడం, ఎడిట్ చేయడం, మార్చడం, సోషల్ మీడియాలో పోస్టు చేయడం, మళ్లీ షేర్ చేయడం, వాటి ద్వారా ఆదాయం పొందడాన్ని నిషేధించింది సుప్రీం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
సోషల్ మీడియాలో కోర్టు విచారణల సెలెక్టెడ్ వీడియోలు, సందర్భానికి విరుద్ధంగా ప్రచారం కావడం వల్ల న్యాయవ్యవస్థ గౌరవం దెబ్బతింటోందని, ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై సుప్రీంకోర్టు విచారణల వీడియోలను ప్రసారం చేయాలంటే సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, హైకోర్టు విచారణల విషయంలో ఆయా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.
అయితే ఈ ఆదేశాలు కోర్టు విచారణలపై మీడియా వార్తలు ప్రచురించడం, ప్రసారాలను అడ్డుకునేవి కావని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్ష కాదని, వార్తా కథనాలపై ఎలాంటి నిషేధం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నియంత్రణ లేకుండా వీడియోలు వైరల్ కావడం వల్ల కోర్టు ప్రక్రియ వినోదంగా మారుతోందని, న్యాయస్థానం 24 గంటల వినోద ఛానల్ కాదని జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ అన్నారు.
వర్చువల్ హియరింగ్‌ల కోసం ఇచ్చే ఆన్‌లైన్ లింక్‌లను కూడా విచక్షణ లేకుండా ఇతరులతో పంచుకుంటున్నారని, ఈ విధానాన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదే సమయంలో కోర్టు వీడియోల ప్రసారంపై మెటా, ఎక్స్ తదితర సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఏఐ సాయంతో న్యాయమూర్తులు, న్యాయవాదుల వ్యాఖ్యలను మార్చి తప్పుడు వీడియోలు సృష్టించే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కూడా గతంలో తాను చెప్పని మాటలను తనకు ఆపాదిస్తూ తప్పుడు కథనాలు ప్రచురించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు, కోర్టు విచారణల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
