‘అసలు రిట్ పిటిషనే దాఖలు కాలేదు’: ఢిల్లీ నిరసనల వివాదంపై చీఫ్ జస్టిస్ క్లారిటీ

‘అసలు రిట్ పిటిషనే దాఖలు కాలేదు’: ఢిల్లీ నిరసనల వివాదంపై చీఫ్ జస్టిస్ క్లారిటీ

విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యను సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించినట్లు వస్తున్న వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ శుక్రవారం కొట్టిపారేశారు. అవన్నీ పూర్తిగా అబద్ధం అని తేల్చి చెప్పారు. ఈ విషయంపై కోర్టులోనే స్పష్టత ఇస్తూ... అసలు సుప్రీంకోర్టులో ఎలాంటి రిట్ పిటిషన్ దాఖలు కాలేదని CJI తెలిపారు. ఒక న్యాయవాది ఇచ్చిన లేఖ (వినతిపత్రం) మాత్రమే తన వద్దకు వచ్చిందని, అది అధికారికంగా దాఖలు చేసిన పిటిషన్ కాదని వివరించారు.

మీడియా రిపోర్టింగ్‌పై అసంతృప్తి
కోర్టులో సరైన పద్ధతిలో దాఖలు చేయకుండా కేవలం ఒక లేఖ ఇస్తే దాన్ని రిట్ పిటిషన్‌గా పరిగణించలేమని CJI అన్నారు. ఈ విషయంలో మీడియా వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆ వార్తలు నిర్లక్ష్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

CJI మాటల్లో
గత రెండు రోజులుగా కేసు దాఖలైందని, దాన్ని ప్రధాన న్యాయమూర్తి విచారించడానికి నిరాకరించారని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఉదయం 10 గంటల వరకు ఒక్క కాగితం కూడా కోర్టులో దాఖలు కాలేదు. అది కేవలం ఒక లేఖ మాత్రమే. దాన్ని నేను పిటిషన్‌గా ఎలా తీసుకోగలను ? కానీ ప్రజలు మాత్రం తమకిష్టమొచ్చినట్లు వార్తలు రాస్తున్నారు అని అన్నారు. 

కోర్టులో ఏం జరిగింది?
విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్య గురించి న్యాయవాది నరేంద్ర మిశ్రా, CJIకి రాసిన లేఖను నోటిమాటగా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే దాన్ని విచారించడానికి నిరాకరిస్తూ... “మా సమయాన్ని వృధా చేయకండి, మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకండి” అని CJI వ్యాఖ్యానించారు.

పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలు మా వద్ద ఉన్నాయని న్యాయవాది చెప్పగా... “మాకు ఆ వీడియోలతో పనిలేదు, వాటిని చూసే సమయం కూడా మాకు లేదు” అని CJI బదులిచ్చారు.

అసలు ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయంటే 
పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈ నిరసనలు మొదలయ్యాయి. విద్యా వ్యవస్థలో మార్పులు, జవాబుదారీతనం కావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 'నీట్ (NEET)' పేపర్ లీక్ వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా విద్యార్థులు  కోరుతున్నారు.

ALSO READ : మోడీ... నువ్వు అనవసరంగా Gen-Z తరంతో పెట్టుకున్నవ్..

ప్రతిపక్షాల మద్దతుతో విద్యార్థులు చేపట్టిన 'సంసద్ చలో' యాత్రను ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ క్రమంలో ఘర్షణలు జరిగి పలువురికి గాయాలయ్యాయి, పోలీసులు కొందరిని అరెస్టు చేసి కేసు  బుక్ చేశారు.