ఈఎస్ఐలో సక్కగ ట్రీట్ మెంట్ చేస్తలె !

ఈఎస్ఐలో సక్కగ ట్రీట్ మెంట్ చేస్తలె !
  • టెస్టులు, సర్జరీల కోసం నిమ్స్, ప్రైవేట్ ​దవాఖానాలకు రెఫర్
  • ఎర్రగడ్డ సూపర్ ​స్పెషాలిటీ హాస్పిటల్​లో వింత పరిస్థితి
  • రెఫరల్ లెటర్ల కోసం పేషెంట్ల సహాయకులకు కష్టాలు

హైదరాబాద్, వెలుగు: ఎంప్లాయీస్ స్టేట్ ​ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐ) కార్డుదారులు, కుటుంబ సభ్యులు ట్రీట్​మెంట్ చేయించుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ​ప్రతి నెలా జీతాల్లోంచి కాంట్రిబ్యూషన్ ​డబ్బులు కట్​అవుతున్నా సక్కగా వైద్యం అందట్లేదు. రోగమొచ్చిన మొదట్లోనే హాస్పిటల్​కు  పోయినా ముదిరేంత వరకు ట్రీట్​మెంట్​చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓపీ నుంచి ఐపీ వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈఎస్ఐ కార్డుదారులకు హెల్త్​ ప్రాబ్లమ్స్​వస్తే ముందుగా సంబంధిత డిస్పెన్సరీల్లో డాక్టర్లను సంప్రదిస్తే అవసరమైన వారిని ఈఎస్ఐ హాస్పిటల్​కు​రెఫర్ చేస్తారు. అక్కడ కూడా ట్రీట్ మెంట్​అందుబాటులో లేకపోతే ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​కు పంపిస్తారు. ఇక్కడ అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నా,  చాలా డిపార్టుమెంట్లలో ట్రీట్ మెంట్​ సరిగా చేయడంల లేదని  పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు  చేయకపోవడంతో చిన్న టెస్టులకు కూడా రెండు, మూడ్రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నారు. సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్​ కావాలంటే వారంపైనే అవుతుందని పేషెంట్ల బంధువులు వాపోతున్నారు. గుండెకు సంబంధించి యాంజియోగ్రామ్ టెస్టు కావాలంటే వేరే హాస్పిటల్​కు వెళ్లక తప్పడం లేదు. సర్జరీ చేయాలన్నా, గుండెకు సంబంధించిన ఈసీజీలో చిన్న సమస్య వచ్చినా యాంజియోగ్రామ్​ టెస్టులు  చేయక తప్పడం లేదు. ఈ టెస్టు ఇక్కడ లేదంటూ వేరే హాస్పిటల్స్​కు​రెఫర్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లి ఇన్ పేషెంట్​లో అడ్మిట్ అయి టెస్టు చేసుకొని ఆ రిపోర్టు వచ్చేంత వరకు సర్జరీ వాయిదా వేస్తున్నారు. ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉంటుంది.  ఆస్పత్రిలో అందుబాటులోని  ట్రీట్ మెంట్ ​కోసమే  రెఫర్  చేస్తున్నామని ఈఎస్ఐ డాక్టర్లు చెబుతున్నారు. 

హైదరాబాద్​ రీజియన్​లో 23 డిస్పెన్సరీలు

హైదరాబాద్​ రీజియన్​లోని  హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్​, మహబూబ్ నగర్​ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో 23 డిస్పెన్సరీలు ఉండగా, నాచారం, ఆర్సీపురంలో రెండు హాస్పిటల్స్​ ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్​లో రెండు, మిగతా జిల్లాలకు ఒక లోకల్​ఆఫీసులు ఉన్నాయి. లోకల్​ ఆఫీసులో కార్డుదారులకు సంబంధించిన సెలవులు అప్లయ్ చేసుకోవడం, పేమెంట్స్​కి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. 7 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండగా వారి ఫ్యామిలీ మెంబర్స్​కలిపితే 20 లక్షల మంది ఉంటారు. ఇంత మందికి సరిపడా ఫెసిలిటీస్​ మాత్రం కల్పించడం లేదని అంటున్నారు.

రెఫరల్ పై వెళ్తే ఇబ్బందులు

ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో అందుబాటులో లేని ట్రీట్ మెంట్​ కోసం నిమ్స్​తో పాటు మరికొన్ని కార్పొరేట్​ హాస్పిటల్స్ కు రెఫర్​ చేస్తున్నారు. వారానికోసారి రెఫరల్ ​లెటర్​ఈఎస్ఐ నుంచి తీసుకురావాలనే నిబంధన ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారానికోసారి లెటర్​ కోసం ఈఎస్ఐకి వస్తే ఫార్మాలిటీస్​పేరుతో రోజంతా గడిచిపోతుందని, పేషెంట్​పరిస్థితి ఎలా ఉన్నా రెఫరల్ లెటర్ కోసం తిరగక తప్పడం లేదని పేషెంట్ల బంధువులు ఆవేదన 
వ్యక్తం చేస్తున్నారు.  

మందులకే రూ.50 వేలు ఖర్చయినయ్​ 

ఈఎస్ఐ  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నాన్నను అడ్మిట్​ చేస్తే నెల రోజులు ఉంచుకొని యాంజియోగ్రామ్​ టెస్టు కోసమని నిమ్స్​కు రెఫర్ చేశారు. ఇక్కడ టెస్టు కోసం వారం రోజులు అడ్మిట్​అయినం. క్యాథ్ ల్యాబ్​ లేదని మళ్లీ నిమ్స్​లో సర్జరీ చేసుకోమని రెఫర్ చేశారు. రెండు సర్జరీలకు నెల రోజులు పట్టింది. రెండుసార్లు రెఫరల్​ లెటర్లు తెచ్చిన. ఎవరు చెప్పలేదని మూడోసారి లెటర్​తేకుంటే డిశ్చార్జీ చేశాక మూడ్రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంజక్షన్లు, మెడిసిన్స్​ బయటి నుంచి తెచ్చుకుంటే రూ.50 వేలు అయినయ్. 
- రమేశ్ కుమార్, సంగారెడ్డి జిల్లా

మెడిసిన్స్ ఇవ్వట్లే

ఈఎస్ఐలో ట్రీట్ మెంట్​పొందుతున్న వారితో పాటు రెఫర్​పై ఇతర హాస్పిటల్స్​కు వెళ్లిన వారికి అన్నిరకాల మెడిసిన్స్​ అందించాల్సి ఉన్నప్పటికీ నిమ్స్ తో పాటు కొన్ని కార్పొరేట్​ హాస్పిటల్స్​లో  ఎక్కువ ధర ఉండే మందులు బయట నుంచి కొని తెచ్చుకోమని పేషెంట్లకు చెబుతున్నారు. మందుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయక తప్పడం లేదని పేషెంట్ల బంధువులు వాపోతున్నారు. ఈఎస్ఐలో పేరుకే ఫ్రీ ట్రీట్ మెంట్​అని, మందులకే వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్​నుంచి డిశ్చార్జీ అయిన పేషెంట్లకు డిస్పెన్సరీల్లో మందులు ఇవ్వాల్సి ఉన్నా, లేవని చెప్పి పంపుతున్నారు.