తగ్గిన 651 మందుల ధరలు

తగ్గిన 651 మందుల ధరలు

న్యూఢిల్లీ: షెడ్యూల్డ్​  డ్రగ్స్ ​ధరలపై  పరిమితులు విధించడంతో 651 రకాల మందుల ధరలు ఈనెల నుంచి సగటున 6.73 శాతం తగ్గాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్​పీపీఏ) ప్రకటించింది.  మెజారిటీ మందుల  ధరలను  ప్రభుత్వం తగ్గించిందని తెలిపింది. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ఈఎం)లోని మొత్తం 870 షెడ్యూల్డ్ డ్రగ్స్‌‌‌‌లో ఇప్పటివరకు 651 మందుల సీలింగ్ ధరలను ప్రభుత్వం తగ్గించగలిగిందని ఎన్​పీపీఏ ట్వీట్‌‌‌‌ చేసింది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2022లో ఎన్​ఎల్​ఈఎంలో మార్పులు చేసి మొత్తం 870 మందులను చేర్చింది.  ఎన్​పీపీఏ నిర్ణయాల ఫలితంగా 651 ఎసెన్షియల్​ డ్రగ్స్​ ధరలు ఇప్పటికే 16.62 శాతం తగ్గాయి. నిజానికి వీటి ధరలు ఈ నెల నుంచి 12.12 శాతం పెరగాల్సి ఉండగా, తాము తగ్గించామని ఎన్​పీపీఏ తెలిపింది. హోల్​సేల్​ ప్రైస్​ ఇండెక్స్​ (డబ్ల్యూపీఐ) ఆధారంగా మందుల ధరలు గతంలో వార్షికంగా 12.12 శాతం పెరిగినప్పటికీ, తాజాగా ధరల తగ్గుదల వల్ల యూజర్లు ప్రయోజనం పొందుతారని పేర్కొంది. ఎన్​ఎల్​ఈఎం లిస్టులోని మందుల ధరల్లో మార్పులు డబ్ల్యూపీఐ ఆధారంగా ఉంటాయి.