అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పలు సంఘాలు..తీవ్ర ఉద్రిక్తత

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పలు సంఘాలు..తీవ్ర ఉద్రిక్తత

అసెంబ్లీ ముట్టడి చేసేందుకు వచ్చిన NSUI కార్యకర్తలను, ఫిషరీస్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తోన్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వీరితో పాటు మరికొన్ని సంఘాల నేతలు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి సామాజిక వర్గం ఆందోళన చేస్తుండగా... మత్స్యకారుల సమస్యల పరిష్కరించాలని NSUI ఆందోళన చేస్తోంది. వీరితో పాటు అసెంబ్లీ ముట్టడికి వచ్చిన  సింగరేణి కార్మికులు,   VRA లు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ రోజు అసెంబ్లీ ముట్టడిస్తామని పలు విద్యార్థి సంఘాలు, VRA లు, టీచర్స్ పిలుపునివ్వడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అసెంబ్లీ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తు్న్నారు. అసెంబ్లీ చుట్టుపక్కల ఎలాంటి నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించి... పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు.