కాళేశ్వరం ఎంక్వైరీకి కేసీఆర్ ను పిలిస్తే తప్పులేదు: కేటీఆర్

కాళేశ్వరం ఎంక్వైరీకి కేసీఆర్ ను పిలిస్తే తప్పులేదు:  కేటీఆర్
  • ప్రధాని చెప్తే నమ్మి నోట్ల రద్దుకు సహకరించాం
  •  తర్వాత చెంపలేసుకున్నం
  •  కడియం వరంగల్ ప్రజలకు ద్రోహం చేశారు
  •  మా పార్టీ నుంచి పోయినోళ్లను తిరిగి రానివ్వం
  •  ఈటలను మల్లారెడ్డి మునగచెట్టు ఎక్కించిండు
  •  8 నుంచి 9 ఎంపీ సీట్లు గెలుస్తమనుకుంటున్న
  •  ఏపీలో మళ్లీ జగన్ కే అధికారం
  •  లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు
  •  మీడియాతో చిట్ చాట్ లో కేటీఆర్

హైదరాబాద్: కాళేశ్వరంపై విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ను పిలిస్తే తప్పులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రి నుంచి తెలుసుకోవాలనుకోవడం తప్పులేదంటూ చమత్కరించారు. తాము కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అంశాల వారీగానే మద్దతు ఇచ్చామని అన్నారు. ప్రధాని మోదీ మాట నమ్మి నోట్ల రద్దుకు సహకరించామని చెప్పారు. తర్వాత చెంపలేసుకున్నామని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. 

కడియం శ్రీహరి పార్టీ కి ద్రోహం చేశారని పేర్కొన్నారు. ఆయన వరంగల్ ప్రజలను వంచించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీవి ఉద్దెర పథకాలని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ 8 నుంచి 9 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొంచం గట్టిగా ప్రయత్నిస్తే 12 సీట్లు గెలుస్తామని కేటీఆర్ చెప్పారు. ఓట్లు వేయకుంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎత్తేస్తానని సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి చాలా తెలివైనోడని, కావాలనే ఈటలను మునగ చెట్టు ఎక్కించారని అన్నారు. 

ఈటల రాజేందర్ ను ఇప్పటి వరకు రెండు సార్లు ఓడించామని, మూడో సారి కూడా ఓడిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్కకు ఓడిపోతున్నామని అర్థమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీవన్నీ ఉద్దెర పథకాలని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ లీడర్ల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. వాళ్లు మళ్లీ వస్తామన్నా తమ పార్టీలోకి రానివ్వబోమని చెప్పారు. ఏపీలో తమకున్న సమాచారం మేరకు వైఎస్సార్ సీపీ విజయం సాధించబోతున్నదని అన్నారు. హరీశ్ రావు రాజీనామా సవాల్  పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని అన్నారు. ఒట్లు ప్రమాణాలు కాదని సవాల్ ను స్వీకరించాలని అన్నారు.