తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్

తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: మిడిల్ ఈస్ట్‌‌‌‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం  కొనసాగుతున్నట్టు వార్తలు వస్తుండటంతో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న  భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. 

అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. ఇరాన్  ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని తెలిపారు. 

అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్‌‌‌‌తోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని సీఎం 
ఆకాంక్షించారు.