ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి..పక్కా సమాచారంతో ఇజ్రాయెల్, అమెరికా అటాక్ 

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి..పక్కా సమాచారంతో ఇజ్రాయెల్, అమెరికా అటాక్ 
  • శనివారం తొలిదాడిలోనే ఖమేనీతోపాటు నలుగురు కుటుంబసభ్యులు మృతి 
  • రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్, ఇతర నేతలూ హతం 
  • 40 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్ 
  • ఆ దేశం​లో ఒకవైపు విషాదం.. మరోవైపు సంబురాలు 
  • ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షియా ముస్లింల నిరసనలు 
  • గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా బేస్​లపై ఇరాన్ దాడులు  
  • ఖమేనీ హత్యను ఖండిచిన రష్యా, చైనా, ఉత్తర కొరియా 
  • ఇరాన్ పగ్గాలు చేపట్టిన తాత్కాలిక ‘లీడర్​ షిప్ కౌన్సిల్’

టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. శనివారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన కార్యాలయంలో 86 ఏళ్ల ఖమేనీ చనిపోయారు. ఖమేనీ మరణ వార్తను ముందుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చరిత్రలోనే అత్యంత దుర్మార్గపు వ్యక్తులలో ఒకరు మరణించారని, ఇరాన్ ప్రజలు దేశాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘ఐఆర్ఐబీ’ కూడా ఖమేనీ మృతిని ధ్రువీకరించింది. "ఇరాన్ సుప్రీం లీడర్ అమరత్వం పొందారు" అని ఆదివారం ఉదయం  ప్రకటించింది. 

ఖమేనీ తన కార్యాలయంలోనే మరణించారని.. "ప్రపంచ దురహంకారాన్ని"  ఎదిరిస్తూ ప్రజల పక్షాన, తన బాధ్యతల్లో అగ్రభాగాన నిలిచారని పేర్కొంది. ఖమేనీతోపాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్‌పూర్, సుప్రీం లీడర్ సలహాదారు అలీ షమ్ఖానీ వంటి కీలక నేతలు కూడా ఈ దాడుల్లో మరణించారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవడు కూడా మృతి చెందినట్లు పేర్కొంది.

ఖమేనీ మరణానికి కారణమైనవారిపై తీవ్ర ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. ఆదివారం కూడా ఇటు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇటు ఇజ్రాయెల్ పైకి, అటు గల్ఫ్​ దేశాల్లో అమెరికాకు చెందిన 27 ఎయిర్ బేస్ లపై క్షిపణులు ప్రయోగించింది. కాగా, ఖమేనీ మరణంతో ఇరాన్​లో ఒక వర్గం ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోగా, మరో వర్గం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలను, ఏడు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. 

కొనసాగిన దాడులు.. ప్రతీకారదాడులు..  

ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతినబూని, గల్ఫ్ ప్రాంతాలపై దాడులు ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ తాజా దాడులకు దిగింది. ఆదివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం వరుస పేలుళ్లతో విరుచుకుపడింది. "టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ ఉగ్రవాద పాలనకు చెందిన లక్ష్యాలపై దాడులు చేస్తున్నాం" అని ఐడీఎఫ్ ప్రకటించింది. ఉత్తర టెహ్రాన్‌లోని దేశ పోలీసు ప్రధాన కార్యాలయం, ఇరాన్ స్టేట్ టెలివిజన్ కేంద్రం ఉన్న పరిసరాల్లోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ఒక భవనం నుండి భారీగా పొగ ఆకాశంలోకి వ్యాపించడం ఒక వీడియోలో కనిపించింది.  ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 500 లక్ష్యాలపై, గతంలో దెబ్బతిన్న వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలతో సహా, చరిత్రలోనే అతిపెద్ద వైమానిక దాడిని నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మిషన్‌లో సుమారు 200 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని తెలిపింది. కాగా, ఆదివారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు దుబాయ్, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్ సహా అనేక గల్ఫ్ ప్రాంతాలను తాకాయి.

భారత్‌ సహా అనేక దేశాల్లో నిరసనలు

సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను రష్యా, చైనా, ఉత్తర కొరియా తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఖమేనీ మరణంతో ఆదివారం భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరసనలు మిన్నంటాయి. ఖమేనీ హత్యకు నిరసనగా ఆదివారం కాశ్మీర్, యూపీ, పంజాబ్, రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో షియా మతస్తులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

9 యుద్ధ నౌకలను ముంచేశాం: ట్రంప్​

ఇరాన్‌కు చెందిన జమరాన్ క్లాస్‌తో సహా 9 యుద్ధ నౌకలను ముంచేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్ నేవీ హెడ్డాఫీసు కూడా ధ్వంసమైందని, తమ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ సైన్యం మరియు పోలీసులు వెంటనే తమ ఆయుధాలు వదిలి లొంగిపోవాలని, లేనిపక్షంలో మిగిలిన నౌకలకు కూడా అదే గతి పడుతుందని ట్రంప్ హెచ్చరించారు.

పక్కాగా ట్రాక్ చేసి అటాక్.. 

ఇరాన్ నుండి దశాబ్దాలుగా పొంచి ఉన్న ముప్పును అంతం చేయడానికి, ఆ దేశం అణు ఆయుధాన్ని తయారు చేయకుం డా అడ్డుకోవడానికి ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ చెప్పారు. నిఘా, ట్రాకింగ్ వ్యవస్థ ల ద్వారా ఖమేనీ కదలికలను నిరంతరం పర్యవేక్షించామని, ఆయన తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండాపోయిం దని స్పష్టం చేశారు. "పశ్చిమాసియాలో శాంతి నెలకొనే వరకు ఈ ఖచ్చిత త్వంతో కూడిన బాధ్యతాయుత దాడులు కొనసాగుతాయి" అని ట్రంప్ హెచ్చరించారు.

.కాగా, ఖమేనీ నివాస సముదాయంపై జరిగిన దాడిలో ఆయన మరణించారని, మృతదేహాన్ని కూడా వెలికితీశారని సీనియర్ ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఫోటోను చూపించినట్లు 'చానల్ 12' వెల్లడించింది. 

కొత్త నాయకత్వం..  

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ ప్రభుత్వ టెలివిజన్ ద్వారా ప్రసంగిస్తూ, దేశంలో కొత్త లీడర్షిప్ కౌన్సిల్ పని ప్రారంభించిందని చెప్పారు. మరో ఒకటి రెండు రోజుల్లో కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంటామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఖమేనీ మరణించిన నేపథ్యంలో, దేశ తాత్కాలిక 'లీడర్షిప్ కౌన్సిల్'లో జ్యూరిస్ట్ మెంబర్ గా అయతొల్లా అలీరెజా అరాఫీని ఇరాన్ ప్రభుత్వం ఆదివారం నియమించింది.

సంప్రదాయ మత గురువు, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడైన అరాఫీ.. ఇప్పుడు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ గులాం హుస్సేన్ మొహసేనీ ఎజీతో కలిసి ఈ మండలిలో బాధ్యతలు నిర్వరిస్తారు. కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ఈ తాత్కాలిక మండలి అత్యున్నత అధికార బాధ్యతలు చూస్కుంటుంది.