- ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఇప్పటి నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మా ట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ను సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నది ఇదే జంతర్ మంతర్ వేదిక నుంచే. ఇయ్యాల చారిత్రాత్మకమైన రోజు. ఈ తేదీని గుర్తుంచుకోండి. ఇప్పటి నుంచే బీజేపీ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైంది.
అవినీతిపై మోదీ చర్యలు తీసుకోరు. ఎందుకంటే, మోదీకి స్వయంగా అవినీతిలో భాగస్వామ్యం ఉంది. ఆయన పార్టీ సభ్యులు, మిత్రులు ఈ కుంభకోణాల్లో నిమగ్నమై ఉన్నారు. నేను అవినీతిపరుడిని కాదు, మోదీనే అవినీతికి పాల్పడుతున్నారు” అని ఆరోపించారు.
అవినీతిని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ‘‘ఢిల్లీ సీఎంగా నేను పదేండ్లు పని చేశాను. మోదీ నాకు వ్యతిరేకంగా జరిపించిన ఎంక్వైరీల్లో పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. ఈ పదేండ్లలో నేను ఎన్నో ఫైళ్లపై సంతకాలు చేశాను. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క కాంట్రాక్టర్ లేదా వెండర్ అయినా ముందుకొచ్చి ‘కేజ్రీవాల్ నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు’ అని చెబితే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని పేర్కొన్నారు.
