దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్

దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్

సైబర్ మోసగాళ్ల వలలో పడి ముంబైలోని ఓ రిటైర్డ్ ఎంఎన్‌సి డైరెక్టర్‌  ఏకంగా రూ.25 కోట్లు పోగొట్టుకుంది. ఇటీవలి కాలంలో నగరంలో ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని జరిగిన అతిపెద్ద సైబర్ ఫ్రాడ్ కేసుల్లో ఇదొకటి అని పోలీసులు చెబుతున్నారు. ముంబైలో నివాసం ఉంటున్న బాధితురాలికి  ఫిబ్రవరి 6న వాట్సాప్  కాల్ వచ్చింది. 

సైబర్ నేరగాడు సీబీఐ అధికారిని అంటూ  ఆమెతో మాట్లాడుతూ మీ ఆధార్  నెంబర్ మనీలాండరింగ్ దర్యాప్తులో ఉన్నట్లుగా మాట్లాడాడు.  ఆ తర్వాత  పోలీసు అధికారిగా నటిస్తున్న మరొక వ్యక్తికి ఫోన్ ట్రాన్స్ ఫర్ చేశాడు. బాధితురాలిపై మనీలాండరింగ్ ఫిర్యాదు అందిందని, ఆమె మొబైల్ నంబర్లు, ఆధార్ కార్డు కేసుకు లింక్ చేయబడిందంటూ చెప్పారు. ఈ కేసు నుంచి బయటపడాలనుకుంటే ఈ బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేయాలని చెప్పారు.  

సైబర్  మోసగాళ్లు బాధితురాలి పేరుపై ఖాతా కూడా తెరిచి అక్కడ డబ్బులు డిపాజిట్ చేయాలని కోరారు. ఆమె డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపుతామని ఆమెకు చెప్పారు. కాల్ చేసిన వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి చెల్లింపు రశీదును కూడా తీసుకోమని బాధితురాలికి చెప్పాడు.  బాధితురాలు ఆ ఖాతాకు రూ.25 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసింది. ఆ తరువాత సైబర్ నేరగాళ్ల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే కలవకపోవడంతో  మోసపోయానని గుర్తించి ముంబై పోలీసులను ఆశ్రయించింది.