ద్రాక్షల్లో వెరైటీలెన్నో.. రాజేంద్రనగర్లో ఆకట్టుకుంటున్న గ్రేప్స్ ఫెస్టివల్ 

ద్రాక్షల్లో వెరైటీలెన్నో.. రాజేంద్రనగర్లో ఆకట్టుకుంటున్న గ్రేప్స్ ఫెస్టివల్ 
  • హార్టికల్చర్ వర్సిటీలో 64 రకాల పండ్ల సాగు
  • ఆర్గానిక్ పద్ధతిలో సాగుపై రైతులకు అవగాహన 
  • కొత్త రకలపై పరిశోధనలు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజేంద్రనగర్​లోని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన గ్రేప్ రీసెర్చ్ సెంటర్​లో గ్రేప్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది. ఇక్కడ ద్రాక్ష సాగుపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో గ్రేప్ రీసెర్చ్ సెంటర్ ఉండగా ఆరెకరాల్లో దాదాపు 64 రకాల ద్రాక్ష పండ్లను సాగు చేస్తున్నారు. ఇందులో 59  వెరైటీలను గ్రేప్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శనకు ఉంచారు. ఇందులో టేబుల్ గ్రేప్స్, వైన్ గ్రేప్స్, కిస్మిస్ తయారీకి ఉపయోగించే గ్రేప్స్, జ్యూస్ గ్రేప్స్  వంటి అనేక రకాలను పెంచుతూ దిగుబడి, నాణ్యతపై పరిశోధనలు చేస్తున్నారు.

థాంప్సన్ సీడ్‌‌‌‌‌‌‌‌లెస్, ఫ్లేమ్ సీడ్‌‌‌‌‌‌‌‌లెస్, అనాబ్-ఇ-షాహి, క్రిమ్సన్ సీడ్‌‌‌‌‌‌‌‌లెస్, రెడ్ గ్లోబ్, బెంగళూరు బ్లూ రకాలు ఇక్కడ కనిపిస్తాయి. పైనవే కాకుండా ఈ సెంటర్ లో ఎక్స్​క్లూజివ్​గా మంజరీ మెడికా, మంజీరా షామా, హెచ్ వన్ 56 అనే మూడు రకాలను ఇక్కడే సృష్టించారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెల ఆరో తేదీన ప్రదర్శన మొదలుకాగా, 12వ తేదీ వరకు కొనసాగనున్నది. 

టేబుల్ గ్రేప్స్ సో స్వీట్..

తినడానికి ఉపయోగించే ద్రాక్షను టేబుల్ గ్రేప్స్ అంటారు. ఇందులో కూడా రకాలుంటాయి. థాంప్సన్ సీడ్‌‌‌‌‌‌‌‌ లెస్, ఫ్లేమ్ సీడ్‌‌‌‌‌‌‌‌లెస్, క్రిమ్సన్ సీడ్‌‌‌‌‌‌‌‌లెస్, రెడ్ గ్లోబ్, అనాబ్- ఇ-షాహి. ఇవన్నీ తియ్యగా ఉంటాయి. పెద్ద గుత్తులు మంచి రంగుతో మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ డిమాండ్ కలిగి ఉంటాయి. ఇందులో రెడ్​గ్లోబ్​రకాన్ని గ్రేప్ రీసెర్చ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో కిలోకు రూ.800 వరకు అమ్ముతున్నారు. మిగతావి కిలో రూ.200 నుంచి రూ.300 వరకే దొరుకుతాయి. ఈ రకానికి ఎకరానికి 20 నుంచి 30 టన్నులు వస్తుంది. 

రెడ్ ​గ్లోబ్​ స్పెషాలిటీ..

రెడ్ గ్లోబ్ లో పెద్ద, గుండ్రని పండ్లు వస్తాయి. వీటి రుచి అమోఘం. ఈ రకం ద్రాక్షకు అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. థాంప్సన్ సీడ్‌‌‌‌‌‌‌‌లెస్, సోనాకా, ఫ్లేమ్ సీడ్‌‌‌‌‌‌‌‌లెస్ వంటి రకాలు రైతులకు అధిక లాభాలు అందించే ద్రాక్ష రకాలుగా గుర్తింపు పొందాయి.

కిస్మిస్ గ్రేప్స్

ఎండబెట్టి కిస్మిస్ (రేసిన్) తయారు చేసే ద్రాక్షను కిస్మిస్ గ్రేప్స్ అంటారు. థాంప్సన్ సీడ్‌‌‌‌‌‌‌‌లెస్, పూసా సీడ్‌‌‌‌‌‌‌‌లెస్, అర్కావతి, కిష్మిష్ బెలీ వంటి రకాలు ఇక్కడ దొరుకుతున్నాయి. వీటిలో కూడా తీపి శాతం మరీ ఎక్కువే..అందుకే ఎండబెట్టి కిస్మిస్​తయారు చేస్తారు.  కిస్మిస్ గ్రేప్స్ కూడా 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 

జ్యూస్ చేసుకునే గ్రేప్స్

జ్యూస్​ గ్రేప్స్​లో రసం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకమైన సువాసన దీని సొంతం. తియ్యగానూ ఉంటుంది. బెంగళూరు బ్లూ, కాన్‌‌‌‌‌‌‌‌కార్డ్, ఇసబెల్లా, క్యాంప్‌‌‌‌‌‌‌‌బెల్ ఎర్లీ ఇందులో రకాలు. బెంగళూరు బ్లూ నల్లగా ఉండి ఎక్కువ రసం, మంచి వాసనతో ఉంటాయి. అందుకే, జ్యూస్ తయారీలో ఉపయోగిస్తారు. కాన్‌‌‌‌‌‌‌‌కార్డ్, ఇసబెల్లా రకాలు కూడా జ్యూస్, జెల్లీ, జామ్ తయారీలో ఉపయోగిస్తారు. క్యాంప్‌‌‌‌‌‌‌‌బెల్ ఎర్లీ రకం తొందరగా పండే జ్యూస్ గ్రేప్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు పొందింది. 

ఆర్గానిక్ సాగులోనే ఖర్చు తక్కువ 

ఎరువులు వాడి పండించే ద్రాక్ష కంటే ఆర్గానిక్ సాగులోనే ఖర్చు తక్కువ అవుతుందని ఇక్కడి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని కోసం పెండ, వర్మీ కంపోస్ట్ జీవామృతం వంటి సహజ పదార్థాలను వాడుతున్నామని చెప్తున్నారు. ఖర్చు కూడా ఎకరానికి రూ. లక్ష నుంచి రూ. 1.20 లక్షలకు మించదని అంటున్నారు. ఇలా కాకుండా యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులు, పురుగుమందులు వాడితే ఖర్చు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పోతుందని చెప్తున్నారు. 

రెండు, మూడేండ్ల తర్వాతే పంట

ద్రాక్ష సాగులో మొక్కలు నాటిన తర్వాత రెండు నుంచి మూడేండ్ల తర్వాత పూర్తి స్థాయి పంట వస్తుంది. కొమ్మలను కత్తిరిస్తే పూలు వచ్చి 90 నుంచి 120 రోజుల్లో పండ్లు కోతకు సిద్ధమవుతాయి. ఇలా సుమారు 15 నుంచి 20 ఏండ్ల వరకు పంట వస్తూనే ఉంటుంది. 

వైన్ తయారీకి వాడే గ్రేప్స్​

వైన్ తయారీకి ఉపయోగించే ద్రాక్షను వైన్ గ్రేప్స్ అంటారు. ఇక్కడ బెంగళూరు బ్లూ, కాబర్నెట్ సావినియన్, షిరాజ్, చెనిన్ బ్లాంక్, సావినియన్ బ్లాంక్ వంటి రకాలు ప్రధానంగా ఉన్నాయి. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైన్ తయారీకి ఉపయోగిస్తారు.  ఈ పంట 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 

ద్రాక్షపై అవగాహనకే ఫెస్టివల్ 

గతంలో రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్గొండ లాంటి ప్రాంతాల్లో ద్రాక్ష సాగు చేసేవారు.  ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 700 ఎకరాల్లోపే ద్రాక్ష సాగు చేస్తున్నారు. అందుకే, రైతులకు ద్రాక్ష సాగులో అవగాహన కల్పించేందుకు ఈ గ్రేప్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ద్రాక్ష సాగు, ఆర్గానిక్ ఎరువుల ద్వారా భూసారం దెబ్బతినకుండా వెరైటీ ద్రాక్షలను సాగు చేయడంపై రైతులను సలహాలు సూచనలు చేస్తున్నాం.– అనితకుమారి,  జే. శ్రీనివాస్, సైంటిస్టులు,