- అబుదాబిలోని రిఫైనరీపై సూసైడ్ డ్రోన్లతో అటాక్
- ‘అడ్నాక్ రువైస్’ రిఫైనరీలో భారీగా మంటలు
- ముందు జాగ్రత్త చర్యగా ఉత్పత్తి నిలిపివేసిన సంస్థ
- టెహ్రాన్‌లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. 40 మంది మృతి
అబుదాబి, టెహ్రాన్, వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల ఆర్థికమూలాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా యూఏఈలోనే అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం.. అబుదాబిలోని ‘అడ్నాక్ రువైస్’ పై మంగళవారం దాడి చేసింది. ఉదయం ఇరాన్ నుంచి దూసుకొచ్చిన ఆత్మాహుతి డ్రోన్లు రువైస్ పారిశ్రామిక సముదాయంలోని ఒక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ దాడి జరిగిన వెంటనే సముదాయంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం నుంచి దట్టమైన నలుపు రంగు పొగ ఆకాశాన్ని కమ్మేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయాలపాలు కాలేదని అబుదాబి మీడియా ఆఫీస్ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దాడితో అడ్నాక్ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉత్పత్తి సహా అన్నిరకాల కార్యకలాపాలను నిలిపివేసింది. అడ్నాక్ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే రిఫైనరీని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అబుదాబి ప్రభుత్వం కోరింది.
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దది..
అడ్నాక్ రువైస్ కర్మాగారంలో రోజుకు సుమారు 9.22 లక్షల బ్యారెళ్ల ముడిచమురును శుద్ధి చేస్తారు. భారీ ప్రమాదాన్ని నివారించేందుకు రిఫైనరీలోని 'వెస్ట్ యూనిట్'ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పటికే హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో అల్లాడుతున్న చమురు మార్కెట్‌కు ఈ దాడి కోలుకోలేని దెబ్బ. సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
టెహ్రాన్ రక్తసిక్తం..
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడిగా గత 24 గంటలుగా జరుపుతున్న దాడులతో టెహ్రాన్ అతలాకుతలమవుతోంది. ఈ బాంబు దాడుల్లో కనీసం ‘40 మంది పౌరులు’ ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో అధికశాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని అల్ జజీరా ఓ కథనం ప్రచురించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే క్రమంలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మంగళవారమే (అమెరికా కాలమానం) అత్యంత తీవ్రమైన దాడులు జరగబోతున్నాయని హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటికే ఈ యుద్ధంలో ఘోరంగా ఓడిపోతోందని, వారి సైనిక సామర్థ్యం దాదాపు 90 శాతం నిర్వీర్యమైందని ఆయన పేర్కొన్నారు.
రోజుకు 9.22 లక్షల బ్యారెళ్ల ముడిచమురు శుద్ధి
అడ్నాక్ రువైస్ కర్మాగారంలో రోజుకు సుమారు 9.22 లక్షల బ్యారెళ్ల ముడిచమురును శుద్ధి చేస్తారు. భారీ ప్రమాదాన్ని నివారించేందుకు రిఫైనరీలోని 'వెస్ట్ యూనిట్'ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పటికే హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో అల్లాడుతున్న చమురు మార్కెట్‌కు ఈ దాడి కోలుకోలేని దెబ్బ.
