ఐపీఎల్‌‌‌‌పై ఎల్పీజీ ఎఫెక్ట్‌‌‌‌.. హోటళ్లు మూతపడితే ఆటగాళ్ల వసతికి ఇబ్బందులు..!

ఐపీఎల్‌‌‌‌పై ఎల్పీజీ ఎఫెక్ట్‌‌‌‌.. హోటళ్లు మూతపడితే ఆటగాళ్ల వసతికి ఇబ్బందులు..!

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌‌‌‌ ముగిసిన వెంటనే క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌ అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌‌‌‌) 19వ సీజన్‌‌‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 28 నుంచి మే 31 వరకు ఈ మెగా లీగ్‌‌‌‌ జరగనుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని లీగ్ షెడ్యూల్‌ను  బీసీసీఐ రెండు భాగాలుగా ప్రకటించేందుకు రెడీ అవుతోంది. 

తొలి విడత షెడ్యూల్‌‌‌‌ను గురువారం రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ అది కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ సీజన్ ఐపీఎల్‌‌‌‌పై మిడిల్ ఈస్ట్‌‌‌‌లో అమెరికా– ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోలియం, ఎల్పీజీ ఉత్పత్తుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం ఐపీఎల్‌‌‌‌పై ఎఫెక్ట్ చూపనుంది.  

ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తమ వద్ద రెండు రోజులకు సరిపడే గ్యాస్ నిల్వలు ఉన్నాయని పలు స్టార్ హోటళ్లు చెబుతున్నాయి. ఐపీఎల్‌‌‌‌ సందర్భంగా క్రికెటర్లు ఆయా నగరాల్లో స్టార్ హోటళ్లలో బస చేస్తారు. 

ఈ నేపథ్యంలో ఎల్పీజీ కొరత వల్ల లీగ్‌‌‌‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా బీసీసీఐ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ‘పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ నెల 28 నాటికి అంతా అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నాం. కానీ ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే, మేము ఇతర ప్రత్యామ్నాయాలను వెతకాల్సిందే. 

ఎందుకంటే ఇది జట్లు, ఆటగాళ్లపైనే కాకుండా ప్రేక్షకులపైనా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ విషయంపై పూర్తి నిఘా ఉంచాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఇక యుద్ధం కారణంగా పలు దేశాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 

వరల్డ్ కప్‌‌‌‌ కోసం ఇండియా వచ్చిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు ఇంకా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోతున్నారు. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే ఐపీఎల్‌‌‌‌ కోసం ఫారిన్ ప్లేయర్లు ఇండియా చేరుకునే విషయంలోనూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.