- వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొమ్మిది ఎకరాలు కేటాయింపు
- 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలం, ఇందిరమ్మ ఇండ్లు
- కలెక్టరేట్లో టోకెన్లు పంపిణీ చేసిన అధికారులు
- ఇయ్యాల ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పట్టాలు అందజేత
- జాగాలున్న మిగతా 101 మందికి సొంతూర్లలోనే ఇండ్లు మంజూరు
ఖమ్మం, వెలుగు: వెలుగుమట్లలో ఇండ్లు కూల్చిన చోటనే ప్రభుత్వం బాధితులకు ఇంటిజాగలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నారు. 31.07 ఎకరాల భూదాన్ భూముల్లో అర్హులైన వారికి 75 గజాల చొప్పున ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేస్తారు. ఎంపిక చేసిన311 మంది అర్హులకు మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమకు టోకెన్లు రాలేదని, తమ వివరాలు కూడా తీసుకోలేదని ఆందోళనకు దిగగా.. వారితో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు.
ఇంకా అర్హులెవరన్నా ఉంటే సర్వే చేసి, వారికి కూడా ఇండ్ల జాగాలు అందజేస్తామని హామీనిచ్చారు.రెవెన్యూ రికార్డుల ప్రకారం వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో 31.07 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అక్కడ పదేళ్లుగా స్థలాలను ఆక్రమించుకొని కొందరు, ఓపీడీఆర్(ఆర్గనైజేషన్ఫర్ప్రొటెక్షన్ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్) నాయకులను నమ్మి రూ.లక్షలు చెల్లించి మరికొందరు.. ఇలా మొత్తం 740 మంది ఇండ్లు కట్టుకున్నారు. 100 గజాల స్థలం వస్తుందని ఆశ చూపించి బాధితులందరి నుంచి దాదాపు రూ.3 కోట్ల వరకు అక్రమంగా వసూలు చేసినట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఇక్కడ అక్రమణలను గత నెల 24న ప్రభుత్వం కూల్చివేసింది. కూల్చివేతల సమయంలో ప్రతి ఇంటిని వీడియో తీసి, వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇండ్లు కూల్చిన వారిలో అర్హులను గుర్తించేందుకు రెండు వారాలుగా ఫీల్డ్ సర్వే నిర్వహించి 412 మంది అర్హులున్నారని తేల్చారు. ఇందులో ఎక్కడా ఇంటి జాగా లేని 311 మంది పేదలకు భూదాన్ భూమిలోనే తొమ్మిది ఎకరాలు కేటాయించి, ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన 101 మందికి ఇండ్ల జాగాలు ఉండడంతో వారికి సొంతూర్లలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో ఓపీడీఆర్ నాయకులు వసూలు చేసిన డబ్బులను రికవరీ చేసి, బాధితులకు ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 19 కేసులు నమోదు చేసి, తొమ్మిది మంది ఓపీడీఆర్ నేతలను అరెస్ట్ చేశారు.
వేగంగా శిథిలాల తొలగింపు
ఇంటిస్థలాల పంపిణీ కోసం మూడు రోజుల కింద పలు చోట్ల జాగాలు పరిశీలించిన అధికారులు కూల్చిన చోటనే జాగాలను ఇవ్వాలనే నిర్ణయంతో భూదాన్భూముల్లో శిథిలాల తొలగింపు ప్రారంభించారు. మంగళవారం ఉదయం నుంచి జేసీబీలు, లారీలతో శిథిలాలు తొలగించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోడ్లను ఏర్పాటు చేసి, 75 గజాల చొప్పున ప్లాట్ల హద్దులను ఖరారు చేస్తారు. ఆ తర్వాత ప్లాట్లకు నంబర్లు వేస్తారు. అర్హులకు ఇచ్చిన టోకెన్ల మీద ఉన్న నంబర్ల ప్రకారం
ప్లాట్లను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు.
