24x7 హైసెక్యూరిటీ.. ప్రశ్నపత్రాల రక్షణకు NTA కీలక నిర్ణయం

24x7 హైసెక్యూరిటీ.. ప్రశ్నపత్రాల రక్షణకు NTA కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వివాదం తర్వాత పరీక్షా వ్యవస్థ భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ కీలక అడుగు వేసింది. తన ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాలలో 24x7 భద్రతా సేవలను అందించడానికి ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీని నియమించడం కోసం సుమారు రూ.7.5 కోట్ల విలువైన టెండర్‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. హౌస్‌‌‌‌‌‌‌‌కీపింగ్, సెక్యూర్ ప్రింటింగ్ సేవల కోసం కూడా ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ బిడ్లను ఆహ్వానించింది. ఎంపికైన ఏజెన్సీ.. ఢిల్లీలోని మింట్ రోడ్డులో ఉన్న ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ ప్రధాన కార్యాలయం, ఓఖ్లా ప్రాంతీయ కార్యాలయం, ఇతర నిర్దేశిత ప్రాంతాలలో భద్రతను కల్పిస్తుంది. 

సిబ్బంది, సందర్శకులు, అత్యంత రహస్య పరీక్ష సామగ్రి, సర్వర్ గదులు, స్ట్రాంగ్ రూమ్‌‌‌‌‌‌‌‌లు, గోదాములు, రికార్డ్ రూమ్‌‌‌‌‌‌‌‌లు, ఇతర సున్నితమైన సౌకర్యాలను రక్షించే బాధ్యత కూడా ఏజెన్సీదే. ఆసక్తి గల ఏజెన్సీలు ఈ నెల 17 మధ్యాహ్నం 3 గంటల వరకు తమ బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు టెక్నికల్ బిడ్లను తెరుస్తారు. ప్రభుత్వ ఇ -మార్కెట్‌‌‌‌‌‌‌‌ప్లేస్ ద్వారా హౌస్‌‌‌‌‌‌‌‌కీపింగ్ సేవలు, భద్రతా సేవలు, పరీక్ష స్థాయి ప్రింటింగ్ సేవల కోసం వేర్వేరు టెండర్లను జారీ చేసినట్టు ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించింది.

 ఢిల్లీ కార్యాలయానికి సంబంధించిన భద్రత, హౌస్‌‌‌‌‌‌‌‌కీపింగ్ టెండర్లు ఈ నెల 17తో ముగుస్తాయి. ప్రింటింగ్ సేవల టెండర్ కోసం బిడ్లను సమర్పించడానికి 20 చివరి గడువుగా ఉంది. చాలా ప్రభుత్వ విభాగాలు అనుసరించే సంప్రదాయ అత్యల్ప-బిడ్ సేకరణ విధానానికి భిన్నంగా.. సాంకేతిక సామర్థ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ భావించింది. అందుకే ఈ కాంట్రాక్ట్ కోసం 'క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్' పద్ధతిని ఎంచుకుంది. 

ఈ విధానం ప్రకారం, తుది స్కోర్‌‌‌‌‌‌‌‌లో సాంకేతిక ప్రతిపాదనలు (టెక్నికల్ ప్రపోజల్స్) 70% మేర నిర్ణయిస్తాయి. వాణిజ్య బిడ్లు మిగిలిన 30% భాగాన్ని కలిగి ఉంటాయి. సాంకేతిక మూల్యాంకనంలో కనీసం 70 మార్కులు సాధించని ఏజెన్సీలను ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ (ఆర్థిక మూల్యాంకనం) పరిగణనలోకి తీసుకోదు. అత్యంత రహస్య పరీక్ష సామగ్రి, సర్వర్ రూమ్‌‌‌‌‌‌‌‌లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సురక్షిత నిల్వ సౌకర్యాలను రక్షించడం కూడా ఈ ఏజెన్సీ బాధ్యతలలో ఉంటుంది.