న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ, నూక్లియర్ ఎనర్జీ సెక్టార్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తన మొదటి నూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికను త్వరలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డేఏఈ) కి సమర్పించి, అనుమతులు కోరనుంది.
కంపెనీ 2032 నాటికి కనీసం 2 గిగావాట్ల (జీడబ్ల్యూ) నూక్లియర్ పవర్ సామర్థ్యాన్ని సాధించాలని, 2047 నాటికి దీనిని 30 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 14 రాష్ట్రాల్లో ప్రాజెక్టులను పరిశీలిస్తోంది. బీహార్‌లోని బాంకా జిల్లాలో నూక్లియర్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది.
గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి. సగటున ఒక గిగావాట్ నూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.15 వేల నుంచి -రూ.20 వేల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా. ఒక్కో రాష్ట్రంలో 700 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను నిర్మించాలని కంపెనీ భావిస్తోంది.
ఎన్‌టీపీసీ ఇప్పటికే రాజస్థాన్‌లోని మహి బన్‌స్వారాలో నూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్)తో కలిసి రూ.42 వేల కోట్లతో ఒక ప్రాజెక్టును చేపట్టింది. 2047 నాటికి 100 గిగావాట్ల నూక్లియర్ సామర్థ్యం సాధించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
