నుమాయిష్‌‌ ఎగ్జిబిషన్‌‌కు సర్వం సిద్ధం

నుమాయిష్‌‌ ఎగ్జిబిషన్‌‌కు సర్వం సిద్ధం

 

హైదరాబాద్, వెలుగు: నుమాయిష్‌‌ ఎగ్జిబిషన్‌‌కు సర్వం సిద్ధం అయింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్‌‌) జరగనుంది. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో స్టాళ్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. గతంలో మాదిరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ సాయినాథ్ దయాకర్ శాస్త్రి శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ ఏడాది దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2,400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 1,500 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నట్లు తెలిపారు. గతంలో రూ.30గా ఉన్న ఎంట్రీ టికెట్ రేటు రూ.40కు పెంచామని, ఐదేండ్ల లోపు పిల్లలకు ఉచిత ఎంట్రీ అని చెప్పారు. 

సందర్శకులకు ఫ్రీ, పెయిడ్‌‌ పార్కింగ్‌‌ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. పెయిడ్ పార్కింగ్ కావాలనుకునే వారికి ఇంటర్మీడియెట్ బోర్డ్ కాంపౌండ్‌‌లో ఏర్పాట్లు చేశామని, అయితే, దాంతో ఎగ్జిబిషన్ సొసైటీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు సందర్శకులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఎగ్జిబిషన్‌‌లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్‌‌ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను చూసేందుకు వీలుగా ఓపెన్ ఎయిర్ థియేటర్‌‌‌‌ని ఏర్పాటు చేశాన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌కు మెట్రో సౌకర్యం కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అదనపు మెట్రో ట్రైన్లను నడిపేందుకు హెచ్ఎంఆర్‌‌‌‌ ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సైతం స్పెషల్ బస్సులను నడిపేందుకు అంగీకరించినట్లు తెలిపారు.