ఆఫీసర్ల అక్రమాస్తులు.. ఏం చేస్తరంటే..సీజ్‌‌‌‌ చేసి, తాత్కాలికంగా జప్తు చేస్తున్న ఏసీబీ

ఆఫీసర్ల అక్రమాస్తులు.. ఏం చేస్తరంటే..సీజ్‌‌‌‌ చేసి, తాత్కాలికంగా జప్తు చేస్తున్న ఏసీబీ
  •  ఇటీవల వందల కోట్ల ఆస్తులతో పట్టుబడుతున్న అధికారులు 
  •     సీజ్‌‌‌‌ చేసి, తాత్కాలికంగా జప్తు చేస్తున్న ఏసీబీ
  •     లెక్కలు చెప్పకపోతే శాశ్వతంగా జప్తు చేసి వేలం వేసే అవకాశం
  •     రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటివరకు జరగని ఆఫీసర్ల అక్రమాస్తుల వేలం

హైదరాబాద్, వెలుగు : లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయానికి మించిన ఆస్తులతో అధికారులు.. ఏటా వందల మంది అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్నారు. ఆయా అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తున్న ఏసీబీ ఆఫీసర్లు... భారీగా నగదు, బంగారం, స్థిర, చరాస్తులను సీజ్‌ చేస్తున్నారు. ఇలా సీజ్‌ చేసిన అక్రమాస్తులను కోర్టులు తాత్కాలికంగా జప్తు చేస్తున్నాయి. 

జప్తు చేసిన ఆస్తులు వేలం దాకా వెళ్తున్నాయా..? ఆ మొత్తం సర్కారు ఖజానాకు మళ్లుతుందా ? అనే ప్రశ్నలు ప్రస్తుతం సామాన్యుల మదిలో మెదలుతున్నాయి. కానీ దోషులుగా తేలిన అవినీతి అధికారులకు జైలు శిక్షలు, జరిమానాలు తప్ప వారి అక్రమాస్తులను వేలం వేసి, సర్కారు ఖజానాకు మళ్లించిన ఉదంతాలు ఏసీబీ చరిత్రలో ఇప్పటికీ జరగలేదు. ఇలాంటి కేసుల్లో పట్టుబడుతున్న ఆస్తులన్నీ చాలా వరకు కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేర్ల మీద ఉంటుండడంతో వాటిని అక్రమాస్తులుగా ఏసీబీ రుజువు చేయలేకపోతోంది.

అవినీతి అధికారి లెక్కలు చెప్పాల్సిందే..

సర్కారు నుంచి నెలనెలా జీతం తీసుకుంటున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్​, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులంతా అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే వస్తారు. విధి నిర్వహణలో భాగంగా రూ.100 లంచంగా తీసుకున్నా సరే.. అవినీతి నిరోధక చట్టంతో పాటు క్రిమినల్‌ ప్రొసీజర్ కోడ్‌ 1973 కింద శిక్షార్హులవుతారు. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఉద్యోగులతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులను ఏసీబీ అరెస్ట్‌ చేసి, అక్రమాస్తులను సీజ్‌ చేస్తుంది. 

స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సహా బినామీ ఆస్తులను ఏసీబీ అధికారులు కోర్టులో డిపాజిట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే సదరు ప్రభుత్వ అధికారికి నోటీసు ఇచ్చి ఆయా ఆస్తులకు గల చట్టబద్ధమైన ఆదాయ వనరులను నిరూపించుకోవాలని సూచిస్తారు. నిందితుడు అందించే ఆధారాలు, వివరణ సంతృప్తిగా లేకపోతే అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి.. ప్రివెన్షన్‌ ఆఫ్ కరప్షన్‌ చట్ట ప్రకారం చార్జ్‌షీట్ దాఖలు చేస్తారు. 

ఈ దశలో నిందితుడు తన ఆస్తులను ఇతరులకు బదిలీ చేయకుండా, అమ్ముకోకుండా ఏసీబీ ఆఫీసర్లు కోర్టు ద్వారా తాత్కాలిక అటాచ్‌మెంట్ ఉత్తర్వులు తీసుకుంటారు. ఇలా కోర్టు అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులను వినియోగించుకోవడం మినహా విక్రయించే అవశాలు ఉండవు.

అక్రమాస్తులు అని తేలితే వేలం

సంబంధిత శాఖల ఉన్నతాధికారుల నుంచి ప్రాసిక్యూషన్‌ అనుమతి, ఆస్తుల తాత్కాలిక జప్తు సహా చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత కేసు విచారణ జరుగుతుంది. కోర్టులో విచారణ పూర్తై నేరం రుజువైతేనే అక్రమాస్తులకు సంబంధించిన ఆస్తుల అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఏసీబీ సీజ్‌చేసిన ఆస్తుల స్వభావాన్ని బట్టి న్యాయస్థానం రెండు రకాలుగా ఆదేశాలు ఇస్తుంది. 

ప్రభుత్వ అధికారి ప్రత్యక్షంగా తీసుకున్న లంచంతో కొనుగోలు చేసిన ఆస్తులను నేరార్జిత ఆస్తులుగా పరిగణించి.. ప్రభుత్వానికి అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీంతో పాటు సంబంధిత అధికారికి జైలు శిక్ష, జరిమానా సైతం విధిస్తుంది. ఇండ్లు, ఓపెన్‌ ప్లాట్ల వంటి స్థిరాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కోర్టు అనుమతితో బహిరంగ వేలం వేస్తుంది. ఇలా వచ్చిన డబ్బులను ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు.

 
ఒక్కో అధికారి వద్ద రూ. 100 కోట్లకుపైనే...


కాంగ్రెస్​ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కారణంతో పెద్దసంఖ్యలో ఆఫీసర్లను ఏసీబీ అరెస్ట్​చేసి, వేల కోట్ల ఆస్తులను సీజ్​చేసింది. వీరిలో ఏకంగా 17 మంది ఆఫీసర్లు.. ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నారు. 

బీఆర్ఎస్‌ హయాంలో రాజకీయ అండతో ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల్లో కీలకంగా పనిచేసిన ఆఫీసర్లు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఇప్పటికే ఆధారాలు సంపాదించిన ఏసీబీ వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే పనిలో ఉంది. ఆఫీసర్లు అక్రమంగా సంపాదించిన ఆస్తులను వేలం వేస్తే ప్రభుత్వానికి వేలకోట్లు సమకూరే అవకాశం ఉందని, తద్వారా ప్రభుత్వ అధికారులకు గట్టి హెచ్చరిక ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

బంగారం, నగదు ప్రభుత్వ అకౌంట్లలోకి..

ఏసీబీ ఆఫీసర్ల సోదాల్లో పట్టుబడిన నగదును నేరుగా ప్రభుత్వ ఖజానాలో డిపాజిట్ చేస్తారు. బంగారం, వాహనాలకు విలువ కట్టించి వేలం వేస్తారు. వీటితో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్‌ డిపాజిట్లను కోర్టు ఉత్తర్వుల మేరకు.. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా మూసి వేయిస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయిస్తారు. 

ఒకవేళ అక్రమాస్తుల్లో కబ్జాలు చేసినవిగానీ, ప్రభుత్వ భూములు గానీ ఉంటే... ప్రత్యేక చట్టం ద్వారా స్వాధీనం చేసుకుని తిరిగి  ప్రభుత్వానికి అప్పగిస్తారు. కానీ అధికారుల అక్రమాస్తులను వేలం వేసిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేవని ఏసీబీ ఆఫీసర్లు చెప్తున్నారు.