- ప్రభుత్వం చట్టప్రకారమే మూడో డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నది
- ఈఆర్సీ అనుమతి రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది
- విధి విధానాలను బహిరంగంగా ప్రకటించిన ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రైతు డిస్కమ్పై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆఫీసర్లు కోరారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ద్వారా ప్రభుత్వం ఈ డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈఆర్సీ నుంచి అనుమతి రావడానికి కొంత టైం పడుతుందని చెప్పారు. ధ్రువీకరించుకోకుండా తప్పుడు కథనాలను మెయిన్ స్ట్రీమ్, సోషల్‌మీడియాలో ప్రచారం చేయొద్దన్నారు. కొత్త డిస్కమ్ ఏర్పాటు విధివిధానాలను శుక్రవారం ప్రకటించారు.
కొత్త డిస్కమ్ ఏర్పాటు జరిగేది ఇలా..
దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్) ఏర్పాటు చట్టబద్ధమైన, సాంకేతిక, పరిపాలనా, నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో జరిగే ప్రక్రియ. డిస్కమ్ ఏర్పాటులో మొత్తం 12 దశలు ఉంటాయి. ప్రభుత్వం ముందుగా కొత్త డిస్కమ్ అవసరాన్ని గుర్తిస్తుంది. ప్రస్తుత విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుంటుంది. వ్యవసాయ, ప్రాంతీయ పరిపాలనా అవసరాల ఆధారంగా కొత్త సంస్థ ఏర్పాటును పరిశీలిస్తుంది.
రెండో దశలో కంపెనీ నమోదు ప్రక్రియ చేపడుతుంది. డిస్కమ్‌ను గవర్నమెంట్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)లలో ఏదో ఒక పేరుతో కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేస్తారు. ఈ దశలోనే మెమెరాండం ఆఫ్ అసోసియేషన్(ఎంవోఏ), ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏవోఏ), బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకం, కార్పొరేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. మూడో దశలో ఆస్తుల గుర్తింపు, విభజన చేపడుతారు.
రైతు డిస్కమ్ కింద విద్యుత్‌సబ్ స్టేషన్స్, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, హెటీ, ఎల్టీ లైన్లు, భవనాలు, భూములు, వెహికల్స్, వినియోగదారుల సమాచారం వంటి వాటిని విభజిస్తారు. నాలుగో దశలో ఉద్యోగుల కేటాయింపు, ఐదో దశలో ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేపడుతారు. కొత్తగా ఏర్పాటు చేసిన డిస్కమ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ రూల్స్ 2005 ప్రకారం ‘ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దీర్ఘకాలిక నిర్వహణ సామర్థ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్ వంటివి’ తయారు చేస్తారు.
లైసెన్స్ కోసం ఈఆర్సీకి అప్లై
ఆరో దశలో విద్యుత్ పంపిణీ లైసెన్స్ కోసం ఈఆర్సీకి సెక్షన్లు12, 14, 15 ప్రకారం దరఖాస్తు చేస్తారు. ఏడు నుంచి తొమ్మిది దశల్లో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి అర్హత ఉంటే లైసెన్స్ మంజూరు చేస్తుంది. ముందుగా పబ్లిక్ నోటీస్ జారీ చేస్తుంది. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. బహిరంగ మీటింగ్‌లు నిర్వహిస్తుంది. తర్వాత ఈఆర్సీ అధికారికంగా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ జారీ చేస్తుంది. లైసెన్స్ వచ్చాకే డిస్కమ్ అధికారికంగా పనులు చేయడానికి వీలవుతుంది.
పదో దశలో మౌలిక వసతుల సమీకరణ చేపడుతారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్స్, స్కాడా, బిల్లింగ్ సిస్టమ్స్, వినియోగదారుల సర్వీస్ సెంటర్లు, ఫిర్యాదుదారుల కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తారు. పదకొండో దశలో పాత సంస్థల నుంచి వినియోగదారుల బదిలీ ప్రక్రియ చేపడుతారు. సర్వీస్ కనెక్షన్లు, బిల్లింగ్ డేటా, మీటరింగ్ రికార్డ్స్, టారిఫ్ కెటగిరీలు వంటి వాటిని కొత్త డిస్కమ్‌లోకి బదిలీ చేస్తారు.
పన్నెండో దశలో డిస్కమ్ నియంత్రణ, టారిఫ్ ప్రక్రియ చేపడుతారు. ఏఆర్ఆర్ ఫైలింగ్, టారిఫ్ పిటీషన్స్ స్వీకరణ, రెన్యూవెబుల్ పర్చేస్ ఆబ్లగేషన్లు (ఆర్పీవో), స్టాండర్డ్ ఫర్మార్మెన్స్ వంటి వాటిని అమలు చేస్తారని రైతు డిస్కమ్ ఆఫీసర్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే రైతు డిస్కమ్‌కు సంబంధించి ఆరో దశ ప్రక్రియ జరుగుతున్నదని పేర్కొన్నారు.
