టూరిస్టు డబ్బు సీజ్.. సోషల్ మీడియా దెబ్బకు తిరిగి ఇచ్చిన అధికారులు

టూరిస్టు డబ్బు సీజ్.. సోషల్ మీడియా దెబ్బకు తిరిగి ఇచ్చిన అధికారులు

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో విహారయాత్రకు వచ్చిన పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబానికి ఎన్నికల అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. వారి దగ్గర ఉన్న   రూ.69 వేల 400 నగదును సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలలో భాగంగా ఎన్నికల అధికారులు 2024 మార్చి 25వ తేదీ ఆదివారం రోజున వాహన తనిఖీలు చేపట్టారు. అందులో  భాగంగా వారి  నుంచి ఈ నగదను స్వాధీనం చేసుకున్నారు. 

2024 మార్చి 16న లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. అయితే ఆ  నిబంధనల గురించి తమకు తెలియదని మహిళ, ఆమె భర్త ఇద్దరూ పోలీస్ అధికారులకు వివరించారు. తాము టూర్ కోసమే ఇక్కడికి వచ్చామని తెలిపారు.  ఇది జరిగిన ఒకరోజు తరువాత  అంటే సోమవారం రోజున నీలగిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వారి వద్ద ఉన్న  పత్రాలను పరిశీలించి  స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు.  కాగా ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు ఎన్నికల కోడ్ నిబంధనల పేరుతో సామాన్యులను వేధిస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.  

Also Read: మీరు కచ్చితంగా గెలుస్తారు .. రేఖా పాత్రతో ఫోన్లో మాట్లాడిన మోదీ

ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి  వస్తే ఎవరైనా వ్యక్తి  దగ్గర  రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు, రూ. 10 వేల కంటే ఎక్కువ విలువైన కొత్త వస్తువులు, బహుమతులను తీసుకువెళితే  పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటారు.  వాటికి సంబంధించిన ప్రూప్స్ చూపిస్తే  తిరిగి ఇస్తారు.  రూ.10 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకుంటే  మాత్రం నగదును ఆదాయపు పన్ను శాఖకు పంపుతారు. ఎన్నికల ప్రలోభాన్ని అరికట్టేందుకు ఈ చర్యలను అమలు చేస్తారు.