మీరు కచ్చితంగా గెలుస్తారు .. రేఖా పాత్రతో ఫోన్లో మాట్లాడిన మోదీ

మీరు కచ్చితంగా గెలుస్తారు ..  రేఖా పాత్రతో ఫోన్లో మాట్లాడిన మోదీ


పశ్చిమ బెంగాల్ లోని  బసిరాత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సందేశ్‌ఖాలీ బాధితురాలు రేఖా పాత్రతో ప్రధాని మోదీ ఇవాళ ఫోన్ లో  మాట్లాడారు.  ప్రచార సన్నాహాలు, ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న మద్దతు, ఇతర సంబంధిత విషయాలపై చర్చించారు.  ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో  మీరు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారని మోదీ ఆమెకు దైర్యం చెప్పారు. 

సందేశ్‌ఖాలీలో మీరెంతో గొప్ప పోరాటం చేశారని  మోదీ  ఆమెను  కోనియాడారు. ఎంతో మంది శక్తిమంతులను జైలుకు పంపించారని ప్రశంసించారు.  రేఖా పాత్రను శక్తి స్వరూపిణిగా మోదీ అభివర్ణించారు.  కాగా సందేశ్‌ఖాలీ ప్రాంతంలో హింస నుండి బయటపడిన మహిళల్లో రేఖా పాత్ర ఒకరు. సందేశ్‌ఖాలీ ఘటనలో తొలిసారిగా కేసు నమోదు చేసింది రేఖా పాత్రా.

Also Read:మాజీ గవర్నర్ తమిళిసై ఆస్తి ఎంతో తెలుసా?

లోక్‌సభ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్  నేతలు సందేశ్‌ఖాలీ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని మహిళలు టీఎంసీ నేతలు, మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఎత్తున నిరసనలు చేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత పేరు దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఈ మహిళా ఉద్యమంలో రేఖాపాత్ర కీలకంగా వ్యవహరించారు. సందేశ్ ఖాలీ ప్రాంతం బసిరాత్ ఎంపీ పరిధి కిందకు వస్తుంది.  దీనికి బీజేపీ తన ఎంపీ అభ్యర్థిగా రేఖా పాత్రను ఎంచుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాలలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి, ఇది ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.