- జూనియర్ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు అక్కడే
- 3 ఏండ్ల కింద బదిలీ చేసినా పేర్లు లేకుండా చేసుకున్న ఉద్యోగులు
- లాంగ్ స్టాండింగ్ లిస్ట్ పంపినందుకు లొల్లి చేసిన ఓ ఉన్నతాధికారి
- బీసీ వెల్ఫేర్ శాఖలో రూల్స్ ఉల్లంఘన
హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ శాఖలో 20 ఏండ్ల నుంచి హెడ్ ఆఫీసులోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అధికారులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ అంశంపై సీఎం జోక్యం చేసుకోవాలంటున్నారు. 3 ఏండ్లకు ఒకసారి ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేస్తున్నా.. ఆ లిస్ట్‌లో తమ పేర్లు లేకుండా అధికారులు, ఉద్యోగులు కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఇందులో జూనియర్ అసిస్టెంట్ నుంచి అడిషనల్ డైరెక్టర్ స్థాయి వరకు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. బీసీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలోనే ఓ ఉన్నతాధికారి 30 ఏండ్ల నుంచి, మరో అధికారి 20 ఏండ్ల నుంచి హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నారని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఓ మహిళా అధికారి అయితే జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ వరకు హైడ్ ఆఫీసులో పనిచేయటం గమనార్హం.
ఉద్యోగులు బదిలీలపై ప్రభుత్వం జీవో ఇచ్చినందున లాంగ్ స్టాండింగ్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగుల లిస్ట్‌ను ఓ అధికారికి కమిషనర్‌కు పంపించారు. ఈ విషయం తెలిసిన ఓ డిప్యూటీ డైరెక్టర్ ‘నాకు తెలియకుండా లిస్ట్ ఎలా పంపిస్తారు’ అంటూ ఉన్నతాధికారితో గొడవ పడినట్లు సంక్షేమ భవన్‌లో చర్చ సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారులకు వంత పాడుతూ తెలంగాణ ఉద్యోగులు, అధికారులకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా సెక్రటేరియెట్‌లో పాతుకుపోయిన ఏఎస్‌వో, ఎస్‌వో, ఆపై స్థాయి అధికారులను బదిలీ చేశారని, అదే విధంగా బీసీ సంక్షేమ శాఖలోనూ ట్రాన్స్ఫర్ చేయాలని బీసీ సంఘాల నేతలు కోరుతున్నారు.
