టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్‌పై వరుసగా 13 రోజులుగా జరుపుతున్న దాడులను అమెరికా బలగాలు నిలిపేశాయి. శుక్రవారం నుంచి ఇరాన్‌పై అమెరికా బలగాలు ఎలాంటి వైమానిక దాడులు చేయలేదు. ఇరు దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు ఊపందుకోవడంతో పాటు అమెరికా క్షిపణి నిల్వలు తగ్గిపోతుండటం, భవిష్యత్తులో ఘర్షణ మరింత ముదిరి యుద్ధం విస్తరిస్తుందనే భయాల కారణంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా యుద్ధానికి బ్రేక్ ఇవ్వడంతో ప్రపంచ దేశాలకు స్వల్ప ఊరట దక్కింది.
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు వార్ నిలిచిపోవడంతో తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ దాడుల కారణంగా గత వారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 102 డాలర్ల మార్కును దాటిన విషయం తెలిసిందే. అయితే, గత మూడు రోజులుగా ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు నిలిపివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల దిగువకు పడిపోయింది.
సోమవారం (జులై 27) ఉదయం ట్రేడింగ్‌లో చమురు ధర 4.9 శాతం పడిపోయి బ్యారెల్‌కు 92.02 డాలర్లకు చేరింది. శుక్రవారం కూడా చమురు ధర 3.9 శాతం పతనమైంది. గత వారం రెండు నెలల గరిష్ట స్థాయికి చేరిన చమురు ధరలు.. అమెరికా, ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోవడంతో ప్రపంచ ముడి చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
