తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ లక్షల్లో నమ్మించి మోసం చేసిన కేసులో.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పల్లపు సురేశ్ కుమార్ అలియాస్ గోల్డ్ మెన్ సూర్య భాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో సూర్య భాయ్‌ను పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 10న కృష్ణమాచారి అనే వ్యక్తి మరికొందరితో కలిసి హిమాయత్‌నగర్‌లోని ఒక హోటల్‌లో సూర్య భాయ్‌ను కలిశారు. తనకు పెద్ద పెద్ద బంగారం వ్యాపారులతో సత్సంబంధాలు ఉన్నాయని.. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే విదేశాల నుంచి బంగారం తెప్పించి ఇస్తానని సూర్య భాయ్ నమ్మించాడు. మార్కెట్లో కిలో బంగారం ధర కోటిన్నర రూపాయలు ఉంటే.. తాను కేవలం కోటి రూపాయలకే ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి మోసపోయిన బాధితులు పలు దఫాలుగా రూ. 30 లక్షలు చెల్లించారు. మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు.. ఆ తర్వాత నారాయణగూడ పీఎస్‌కు బదిలీ అయింది. ప్రాథమికంగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపారు.
అయితే, ఈ ఆరోపణలను సూర్య భాయ్ తరపు న్యాయవాది కిషన్ తీవ్రంగా ఖండించారు. సూర్య భాయ్‌పై కావాలనే కుట్ర పూరితంగా చీటింగ్ కేసు పెట్టారని ఆయన వాదిస్తున్నారు. బాధితులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఇటీవల సూర్య భాయ్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని.. ఆ సమయంలోనే సూర్య భాయ్ వారికి 20 లక్షల రూపాయల చెక్ ఇచ్చారని లాయర్ తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దర్యాప్తులో సూర్య భాయ్ నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గోల్డ్ మెన్ సూర్య భాయ్ నిజంగానే బంగారం పేరుతో బురిడీ కొట్టించాడా? లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా? అనేది పోలీసుల పూర్తి విచారణలో తేలాల్సి ఉంది.
