ఆన్​లైన్​ రూట్​ మారింది..

ఆన్​లైన్​ రూట్​ మారింది..

చిన్న పట్టణాల వైపుకి దృష్టి అక్కడ వ్యాపారాల విస్తరణకు ప్లాన్

ఈకామర్స్ కంపెనీల కన్ను చిన్న చిన్న పట్టణాలపై పడింది. పెద్ద మొత్తంలో కస్టమర్ బేస్ ఉన్న చిన్న పట్టణాల్లో అవకాశాలను వెతుకుతూ.. అక్కడ తమ వ్యాపారాలను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి. తమ వృద్ధిని పెంచుకోవడానికి ఆ నగరాల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పించబోతున్నాయి. చిన్న పట్టణాల్లో 15 శాతం రిక్రూట్‌‌మెంట్ జరపాలని కూడా వారు భావిస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు. దేశంలో ఈకామర్స్ వ్యాపారాలు వృద్ధి చెందాలంటే చిన్న పట్టణాలే కీలకమని, లాస్ట్ మైల్ కనెక్టివిటీని చేరుకోవాలన్నదే ఆన్‌‌లైన్ రిటైలర్లు టార్గెట్‌‌గా పెట్టుకున్నాయని విశ్లేషకులు చెప్పారు. మరోవైపు చిన్న పట్టణాల వినియోగదారులు కూడా ఆన్‌‌లైన్‌‌ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతుండటంతో ఈకామర్స్ కంపెనీలు ఈ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని చూస్తున్నాయి. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌‌ను అందుకోవడానికి చిన్న పట్టణాల్లో వేర్‌‌‌‌హౌస్‌‌లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఈకామర్స్ తో పాటు లాజిస్టిక్స్, ఈవాలెట్స్, ఎఫ్‌‌ఎంసీజీ, రిటైల్ సెక్టార్లు  వృద్ధి సాధించబోతున్నాయి.

40 శాతం అమ్మకాలు చిన్న పట్టణాల నుంచే….

మెట్రో సిటీలతో పోలిస్తే.. కస్టమర్ బేస్‌‌ టైర్ 2, టైర్ 3 నగరాల్లో అత్యంత వేగంగా పెరుగుతుందని విశ్లేషకులు చెప్పారు. ‘గతేడాది దీపావళి అమ్మకాల్లో టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి 40 శాతం అమ్మకాలు వచ్చాయి. ఇది ఓ పెను మార్పు. ఈకామర్స్ చిన్న పట్టణాలకు విస్తరిస్తుందనడానికి ఇదో నిదర్శనం.     ఈ నగరాల్లో జాబ్ మార్కెట్ 15 శాతం వృద్ధి సాధించబోతుంది’ అని టీమ్‌‌లీజ్ సర్వీసెస్‌‌ డిజిటల్, ఐటీ హెడ్‌‌ మయూర్ సరస్వత్ చెప్పారు. కంపెనీలు ప్రస్తుతం కొత్త మార్కెట్ల వైపుకి చూస్తున్నాయని చెప్పారు. కొన్ని దేశాల లీడింగ్ కంపెనీలు టైర్ 2, టైర్ 3 నగరాల్లో ప్రతిభావంతుల కోసం చూస్తున్నాయని ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్ చెప్పారు. ఈ కంపెనీలు హర్యానాలో అత్యధికంగా 18 శాతం ఉద్యోగ ప్రకటనలు ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్‌‌లో 8 శాతం ఈకామర్స్ జాబ్ పోస్టింగ్సే. ఈకామర్స్ కంపెనీల నుంచి గుజరాత్‌‌లో 2 శాతం, రాజస్తాన్‌‌లో 2 శాతం ఉద్యోగ ప్రకటనలు టైర్ 2, టైర్ 3 నగరాల ప్రతిభావంతుల కోసమేనని అన్నారు. ఈ జాబ్ పోస్టింగ్స్‌‌లో డెలివరీ పర్సన్, గెస్ట్ సర్వీస్ ఏజెంట్, సేల్స్ మేనేజర్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వంటివి ఉన్నాయి. మొత్తం నియామకాల్లో సుమారు 30 శాతం చిన్న పట్టణాల నుంచే ఉందని కార్న్ ఫెర్రి ఆర్‌‌‌‌పీఓ ఇండియా తెలిపింది.