కోల్కతా: ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతుండగా.. తాజాగా టీఎంసీ శాసన సభాపక్ష సమావేశానికి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడంతో సమావేశం అర్ధాంతరంగా రద్దు అయ్యింది. ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ కీలక సమావేశానికి గైర్హాజరు కావడం టీఎంసీ వర్గా్ల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శనివారం (మే 30) మమతా బెనర్జీ నివాసంలో టీఎంసీ శాసనసభ పక్ష సమావేశానికి ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ శోవన్దేబ్ చటోపాధ్యాయ్ పిలుపునిచ్చారు. అయితే, ఈ సమావేశానికి 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో సమావేశం రద్దు అయ్యింది. కీలక సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలను సంప్రదించినప్పటికీ.. వారు అందుబాటులో లేరని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.
►ALSO READ | నిన్న అభిషేక్ బెనర్జీ.. ఇవాళ కళ్యాణ్ బెనర్జీ.. బెంగాల్ లో టీఎంసీ ఎంపీలపై వరుస దాడులు
టీఎంసీ అగ్రనాయకులు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై దాడుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల శాసన సభాపక్ష సమావేశానికి హాజరు కాలేదని టీఎంసీ వివరణ ఇచ్చింది. పార్టీకి చెందిన ఇద్దరు అగ్ర నాయకులైన అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు తీరిక లేకుండా ఉన్నారని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ పేర్కొన్నారు. కానీ టీఎంసీ కప్పిపుచ్చుకునే వివరణ పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి గురి చేసింది.
