పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆదివారం (మే31) హుగ్లీ జిల్లాలోని చండితాల పోలీస్ స్టేషన్ దగ్గర తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఎంసీ నాయకులు, కార్యకర్తల అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గాయపడ్డారు.
శనివారం టీఎంసీఎంపీ, మాజీ సీఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సోనాపూర్ లో కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేసిన 24 గంటల్లోనే మరో నేత కళ్యాణ్ బెనర్జీపై దాడి జరిగడంతో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అనంతరం బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఘటనాస్థలంలో పోలీసులు లేకపోవడంపై విమర్శలు గుప్పించారు. అనంతరం ఆయన కోల్‌కతాలో చికిత్స పొందిన తర్వాత తన పర్యటనను కొనసాగించారు. ఇదే రోజున నకిలీ సంతకాల కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఐడీ నుంచి కూడా ఆయనకు నోటీసులు అందాయి.
