- లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యుల ఆగ్రహం
- క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రి రిజిజు డిమాండ్..
- ససేమిరా అన్న రాహుల్
- గందరగోళం మధ్యే ‘యాంటీ పేపర్ లీక్’ బిల్లు పాస్
- సభలో తనను మాట్లాడనివ్వలేదన్న రాహుల్
- ఎప్పటికీ బీజేపీకి, ఆర్ఎస్‌ఎస్‌కు క్షమాపణ చెప్పనని స్పష్టం
- పోలీసులను అమిత్ షా ఆదేశించడం స్వయంగా చూశానని వెల్లడి
- ఆయనను బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోదీకి సలహా
- విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంలో సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు అతిక్రూరంగా దాడి చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే కారణమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థి నిరసనకారులపై పోలీసు దాడులకు, కాల్పులకు అమిత్ షా స్వయంగా అనుమతి ఇచ్చారన్నారు. దీంతో లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదంతో గందరగోళం చెలరేగింది. బుధవారం లోక్‌సభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫేర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు-2026పై చర్చలో రాహుల్ మాట్లాడారు.
‘‘ఈ దేశపు హోంమంత్రికి ఇక్కడకు వచ్చి కూర్చునే ధైర్యం లేదు.. ఆయన ఈరోజు ఎందుకు రాలేదు? ఎందుకంటే ఆయన భయపడ్డారు. మా విద్యార్థుల శరీరంపై పెల్లెట్లు దించారు’’ అని ఆరోపించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ రుజువులు చూపాలని.. లేదంటే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా వెంటనే జోక్యం చేసుకుంటూ.. చర్చ హోంమంత్రిపై జరగడం లేదని, బిల్లు గురించి మాట్లాడాలని చెప్పారు.
రాహుల్ తన ఆరోపణలకు తగిన రుజువులు చూపాలన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మీరు ఏ ప్రాతిపదికన ఈ మాట చెప్పారు? ఇది అత్యంత అభ్యంతరకరం. మీరు క్షమాపణ చెప్పాలి’’ అని అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై చెలరేగిన గందరగోళం కారణంగా సభ రెండుసార్లు వాయిదా పడింది. దాంతో ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు. ఆ తరువాత సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై ఒక్క తూటా కూడా పేలలేదని, కేవలం టియర్ గ్యాస్ మాత్రమే ప్రయోగించారని తెలిపారు.
రాహుల్ కామెంట్లపై దుమారం..
లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు, ఇతరులకు’ మధ్య తేడాను వివరించే క్రమంలో చేసిన కామెంట్లు దుమారం రేపాయి. కొందరు విద్యార్థులతో జరిగిన సంభాషణను వివరిస్తూ.. ఓపెన్ మైండ్ కలిగి ఉండి సత్యాన్ని కోరుకునేవారే విద్యార్థులని.. రెండవ వర్గంలో తమకు అన్నీ తెలుసని నమ్మే ప్రజలు ఉంటారని ఆయన చెప్పారు. ఆ తరువాత రెండవ వర్గం వారి గురించి చెప్పేందుకు ఆయన ఒక అభ్యంతరకర పదాన్ని ఉపయోగించారు. దీంతో రాహుల్ కామెంట్‌పై అధికార పక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు.
రాహుల్ గాంధీ ఆ పదాన్ని పదేపదే ఉపయోగించడంతో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుని ఆ పదాన్ని ఉపయోగించడం ఆపాలని డిమాండ్ చేశారు. ఎన్‌డీఏ ఎంపీలు కూడా రిజిజుతో గళం కలిపారు. బీజేపీ సభ్యుల అభ్యంతరానికి రాహుల్ బదులిస్తూ.. ఒక విద్యార్థి చెప్పిన దానినే తాను ప్రస్తావిస్తున్నానని, సభలోని ఏ సభ్యుడిని ఉద్దేశించి అనలేదని రాహుల్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రెజరీ బెంచ్‌ల నిరసనలు కొనసాగాయి. ఆ పదబంధాన్ని ఆ తరువాత స్పీకర్ ఓం బిర్లా ప్రొసీడింగ్స్ నుంచి తొలగించారు.
విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తోంది..
భారతీయ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తోందంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘మంత్రి కాదు, ఆర్ఎస్ఎస్ విద్యా మంత్రిత్వ శాఖను నడుపుతోంది” అని ఆరోపించారు. ‘‘ ప్రజలు విద్యార్థులను జ్ఞానాన్ని, సత్యాన్ని ఆర్ఎస్ఎస్ వెతకనివ్వడం లేదు. వారు కల్పించుకునే వారి స్వంత చరిత్ర వెర్షన్‌ను చదవాలని బలవంతం చేస్తున్నారు” అని అన్నారు. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ ఒక చిహ్నం మాత్రమే. ఆర్ఎస్ఎస్ మా విద్యార్థులకు అసలు శత్రువు”అని చెప్పారు. దేశంలోని యూనివర్సిటీలన్నింటికీ ఆర్ఎస్ఎస్‌కు చెందిన వైస్ చాన్సలర్లే ఉన్నారని విమర్శించారు.
సభలో నన్ను మాట్లాడనివ్వట్లే..
విద్యార్థులపై క్రూరత్వం అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనను అనుమతించలేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. బుధవారం లోక్‌సభలో ఇదే అంశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన.. పార్లమెంట్ వెలుపల మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఈరోజు మీరు చూసినట్లుగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేతనైన నన్ను మాట్లాడనివ్వడం లేదు. నేను మాట్లాడేలా సభను ఆర్డర్‌లో పెట్టాలని స్పీకర్‌ను అనేకసార్లు కోరాను. రిజిజు, రాజ్‌నాథ్ సింగ్‌లకు అనేకసార్లు అవకాశం ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు.
అమిత్ షా గురించి ఏదో మాట్లాడాననేది అందుకు సాకుగా చూపారు’’ అని రాహుల్ అన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల క్రూరత్వానికి అమిత్ షాయే కారణమని మరోసారి ఆరోపించారు. ‘‘పోలీస్ బలగాలు లేదా హోంశాఖకు సంబంధించిన బలగాలు తీసుకునే ఏ చర్యకైనా ఆయన ఆర్డర్ అవసరం’’ అని అన్నారు. ‘‘నేను ఎప్పటికీ బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కు లేదా వారితో సంబంధం ఉన్న ఎవరికీ క్షమాపణ చెప్పను. ఈ దేశానికి ముఖ్యమైన సమస్యలను లేవనెత్తడం ప్రతిపక్ష నేతగా నా హక్కు’’ అని అన్నారు. నిరసనల్లో గాయపడిన విద్యార్థుల చిత్రాన్ని ఆయన ప్రదర్శించారు.
ఒక్క తూటా కూడా పేలలేదు
విద్యార్థులపై ఒక్క తూటా కూడా పేలలేదు. కేవలం టియర్ గ్యాస్ మాత్రమే ప్రయోగించారు. తూటాలు పేలనే లేదంటే.. దానికి అనుమతి ఇచ్చారన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. అసలు కాల్పులు జరపాలని ఆదేశాలు ఇచ్చే అధికారం మంత్రికి ఉండదు. అది కలెక్టర్ పరిధిలోని అంశం.
- కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
నీట్ నిరసనలు ఎంతో ఉత్తేజపరిచాయ్..
నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల నిరసనలు తనను ఎంతగానో ఉత్తేజపరిచాయని, భరోసా కల్పించాయని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘ఇది కోపం కాదు, హింస కాదు, ద్వేషం కాదు. ఇది ఈ దేశ యువత, ఈ దేశ భవిష్యత్తు తరాల భావవ్యక్తీకరణ, అత్యంత లోతైన భావన. పార్టీలన్నీ ఈ భావవ్యక్తీకరణను గౌరవించాలి. ప్రతి భారతీయుడూ గర్వపడాలి” అని అన్నారు.
లోక్‌సభలో ప్రసంగం తర్వాత బయటకు వచ్చిన రాహుల్.. పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ఇక్కడ కేవలం 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. నిరసనకారులపై కాల్పులకు హోంమంత్రే ఆర్డర్ ఇవ్వడం, లేదంటే కాల్పుల విషయం ఆయనకు తెలియకపోవడం. మొదటి కేస్‌లో ఆయన దోషి. రెండో కేస్‌లో అసమర్థుడు. వేరే ఆప్షన్ లేదు” అని స్పష్టం చేశారు.
పోలీసులను షా ఆదేశించడం నేను చూశాను..
ఢిల్లీలో విద్యార్థులపై బలప్రయోగం కోసం పోలీసులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇచ్చారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. బుధవారం లోక్‌సభలో యాంటీ పేపర్ బిల్లుపై చర్చలో పాల్గొన్న తర్వాత ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. ప్రధాని మోదీకి నా సలహా ఇదే’’ అని అన్నారు. విద్యార్థులపై పోలీసుల అమానుష కాండపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.‘‘సభలో రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజులకు అనేకసార్లు మాట్లాడే అవకాశం ఇచ్చారు.
నేను క్షమాపణ చెబితే నా ప్రసంగాన్ని కొనసాగించడానికి అనుమతిస్తామని నాకు హామీ ఇచ్చారు. నేను ఎప్పటికీ బీజేపీకి లేదా ఆర్ఎస్ఎస్‌కు క్షమాపణ చెప్పను” అని చెప్పారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమస్యలను లేవనెత్తడం ప్రతిపక్ష నేతగా తన హక్కు అని స్పష్టంచేశారు. ‘‘పెల్లెట్ గన్ గాయాలపాలైన ఒక అబ్బాయి తన కంటిని కోల్పోయే అవకాశం ఉంది. పోలీసులు షాక్ బాటన్‌లను, మేకులు కొట్టిన లాఠీలను ఉపయోగించారు.
ఒక పోలీసు అధికారి నిరసనకారుడిని చెంపదెబ్బ కొట్టాడు. పోలీసు అధికారులను అమిత్ షా ఆదేశించడం నేను స్వయంగా చూశాను” అని రాహుల్ ఆరోపించారు. ‘‘మేం పార్లమెంట్ హౌస్ వద్ద ఉన్నప్పుడు, అమిత్ షా పోలీసు అధికారులకు కాల్ చేయడం కళ్ళారా చూశాను. అమిత్ షా నుంచి జితేంద్ర సింగ్‌కు వరుసగా కాల్స్ రావడం చూశాను. అప్పుడే ఏం జరుగుతుందో ఆయనకు స్పష్టంగా తెలుసని నాకు అర్థమైంది”అని చెప్పారు.
