విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ ?

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ ?

రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనని రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.  ప్రతిపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం మళ్లీ వెతుకులాటను ప్రారంభించాయి.  ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుంది ? అనే దానిపై విపక్షాల్లో వాడివేడి చర్చ మొదలైంది. ఈనేపథ్యంలో వారి దృష్టి ఓ ప్రముఖ వ్యక్తిపై పడిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయనే మహాత్మా గాంధీ, రాజగోపాలాచారిల మనవడు  77 ఏళ్ల గోపాలకృష్ణ గాంధీ.  ప్రతిపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఈయన పేరు పరిశీలించడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. ఆయన  2017లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ యూపీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. అందులో ఎన్డీఏ తరఫు ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు 516 ఓట్లతో గెలిచారు. 244 ఓట్ల తేడాతో  గోపాలకృష్ణ గాంధీ ఓడిపోయారు.  

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసిన నేపథ్యం..

గతంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసిన నేపథ్యం ఆయనకు కలిసి వస్తుందని, చాలావరకు ప్రతిపక్ష పార్టీలు గోపాలకృష్ణ అభ్యర్థిత్వాన్ని బలపరిచే అవకాశం ఉంటుందని  పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2004 నుంచి 2009  సంవత్సరం వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గానూ గోపాలకృష్ణ  సేవలు అందించారు.  బెంగాల్ మాజీ గవర్నర్.. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పోటీ చేయడాన్ని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా సానుకూలంగానే పరిగణించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలంటూ విపక్షాలకు చెందిన కొంతమంది ముఖ్య నాయకులు ఇప్పటికే గోపాలకృష్ణకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన సానుకూలంగానే స్పందించినప్పటికీ.. బుధవారం సాయంత్రంకల్లా పూర్తి స్పష్టతను ఇస్తానని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ గోపాలకృష్ణ గాంధీ ఓకే చెబితే.. ఆయనే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నిలుస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. అలా జరగని పక్షంలో.. ఇంకెవరి పేర్లను రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పరిశీలించాలనే దానిపైనా విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ఈక్రమంలో మరికొందరు వ్యక్తులతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.