పూటకో సర్వే.. రోజుకో రిపోర్ట్.. కన్ఫ్యూజన్లో ఓటర్లు

పూటకో సర్వే.. రోజుకో రిపోర్ట్.. కన్ఫ్యూజన్లో ఓటర్లు

హైదరాబాద్: సోషల్ మీడియా పొలిటికల్ సర్వే రిపోర్ట్ లతో ఊగిపోతోంది.  యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, త్రెడ్, వాట్సాప్, టెలిగ్రాం ఏది ఓపెన్ చేసిన గెలుపెవరిది..? అనే క్యాప్షన్ తో థంబినైల్ కనిపిస్తోంది.. ఇలా మెల్లిగా ఓ సర్వే రిపోర్టును జనంలోకి వదులుతున్నారు.. మారిన పరిస్థితులంటూనే తాము అనుకున్న పార్టీకి ఎడ్జ్ ఇచ్చేస్తున్నాయి కొన్ని సర్వే సంస్థలు. ఇందుకోసం తమ రిపోర్ట్ ను మార్కెట్ లోకి వదిలేందుకు యూట్యూబ్ చానళ్లను మెయింటేయిన్ చేస్తున్నాయి. ఎక్కువ మంది సబ్ స్క్రైబర్లున్న సంస్థలకు ప్యాకేజీలు ఇస్తూ వాళ్ల చానల్ లో ప్రసారం చేయిస్తున్నాయి. 

ఈ సర్వేలన్నీగందరగోళంగా.. పరస్పర భిన్నంగా ఉంటున్నాయి. ఇంతకూ ఎవరు గెలుస్తారు..? అనేది పక్కన పెడితే తాము అనుకున్న, తమను హైర్ చేసుకున్నలీడర్ కే చివరకు జై కొడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఓట్లశాతాన్ని జోడిస్తూ.. ఇప్పుడు మారిన ట్రెండ్ అని తమకు అనుకూలంగా ఉన్నవారికి పట్టం కట్టేస్తూ.. ప్రతికూల అంశాలను ఏకరువు పెడుతూ.. మొత్తానికి తమ యూట్యూబ్ చానల్ లో ఆ లీడర్ ను గెలిపించేస్తున్నారు. కానీ ఓటరు మదిలో విషయాన్ని మాత్రం చెప్పడం లేదన్న విమర్శలున్నాయి. గెలిచే అవకాశం ఉన్న వ్యక్తిని ఓడిపోతున్నట్టు.. రకరకాల పోలరైజేషన్ ను జనాల్లోకి వదిలి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. 

ఆ సర్వేల వెనుక..!

రాష్ట్రంలోని అనేక సర్వే సంస్థలు ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తునే వాదన బలంగా వినిపిస్తున్న మాట. ఓవరాల్ స్టేట్ సర్వే పేరుతో మొదట ఒకటి వదిలి పెడుతున్నారు. ఇంతలోనే ఎవరైనా అభ్యర్థి సదరు సంస్థను సంప్రదించి తమ సెగ్మెంట్ లో పరిస్థితి ఏమిటని అడిగితే.. ప్యాకేజీ తీసుకొని ఆ ఒక్క సెగ్మెంట్ వీడియోను రెడీ చేసి సామాజిక మధ్యమాల్లో పెడుతుండటం గమనార్హం. రీల్స్, షాట్స్ రూపంలో మొబైల్ తెరవగానే మనకు దర్శనమిస్తున్నాయి.  ఇలా అన్ని సెగ్మెంట్లలో ప్రముఖ పార్టీల నుంచి ఈ తరహా ప్యాకేజీలు నడుస్తన్నట్టు సమాచారం. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న సర్వేల్లో నిజమెంత..? అనేది ఫలితాలు వస్తేనే తేలిపోనుంది.