ప్రొ. లింబాద్రిని ఘెరావ్ చేసిన ఓయూ విద్యార్థులు

ప్రొ. లింబాద్రిని ఘెరావ్ చేసిన ఓయూ విద్యార్థులు

ప్రభుత్వ ఉత్తర్వుల పేరిట ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా సీట్లను బ్లాక్ చేస్తూ అక్రమాలను పాల్పడుతున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా యునివర్సిటీ తెలంగాణ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిను ఆయన ఛాంబర్ లో చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. జీవోను అడ్డుపెట్టుకుని కాలేజీ మేనేజ్మెంట్ లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ మాఫియా మార్చేశారంటూ మండిపడ్డారు. వారిపై ఎందుకు మౌనంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనను నిలదీశారు. మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఛాంబర్ లో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలికి చొరబడ్డారు. ఈ క్రమంలో భద్రత సిబ్బంది అడ్డుకోగా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో వారితో వాగ్వాదాదాలకు దిగడం కొద్దిసేపు గందరగోళ పరిస్థితికి దారితీసింది.

ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా  సీట్లను అమ్ముకుంటూ విద్యను వ్యాపారపరం చేశారంటూ ప్లకార్డులతో ఓయూ జేఏసీ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా  ఇంజినీరింగ్ సీట్ల కౌన్సెలింగ్ ను ఏడు దఫాలుగా నిర్వహించాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ డాక్టర్ భట్టు శ్రీహరి  కోరారు.  ఇంజినీరింగ్ కాలేజీల ఆగడాల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని దుయ్యబట్టారు.  సీట్లను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేసి అడ్డదారుల్లో ఇతరులకు అప్పన్నంగా అమ్ముకుంటూ ఉన్నత విద్యావ్యవస్థను వ్యాపారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ఇప్పటివరకు వేల సీట్లను లక్షల రూపాయలు దండుకుని విక్రయించారని ఆరోపించారు. ప్రతిభ కల్గిన విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్న కళాశాలలపై క్రిమినల్ కేసులు పెట్టాలని శ్రీహరి డిమాండ్ చేశారు.