నేవీ సిబ్బంది భద్రతలో కేంద్రం విఫలం : అసదుద్దీన్‌‌

నేవీ సిబ్బంది భద్రతలో కేంద్రం విఫలం : అసదుద్దీన్‌‌
  • హార్మూజ్‌‌ సమీపంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: అసదుద్దీన్‌‌

హైదరాబాద్/చార్మినార్, వెలుగు: అంతర్జాతీ య జలాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం విఫ లమవుతోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధి సమీపంలో ‘సెటెబెల్లో’వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు ఇండియన్‌‌ నేవీ సిబ్బంది మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరాన్‌‌, అమెరికా ఘర్షణల కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అంతర్జాతీయ వివాదాలతో ఎలాంటి సంబంధం లేని ఇండియన్ నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మరోవైపు, అభ్యర్థులపై ఎఫ్‌‌ఐఆర్ నమోదైతేనే నామినేషన్ పత్రాల్లో వెల్లడించాల్సి ఉంటుందని.. అయితే, మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఎఫ్‌‌ఐఆర్ నమోదు కాలేదని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ చెప్పిన విషయాన్ని అసదుద్దీన్‌‌ గుర్తుచేశారు.

సర్‌‌లో పాన్‌‌కార్డునూ గుర్తించండి..

రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కాను న్న సర్‌‌‌‌ ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎలక్షన్ కమిషన్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని ఎంపీ అసదుద్దీన్‌‌ ఒవైసీ కోరారు. ఈసీ గుర్తింపు పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులను చెల్లుబాటు అయ్యే ధ్రువీకర ణ పత్రాలుగా గుర్తించాలని కోరారు.