
- అమాయకులను, చిన్న పిల్లలను చంపుతూ మారణహోమం సృష్టిస్తున్నది: అసదుద్దీన్ ఒవైసీ
- పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ బిలియన్డాలర్ల రుణం ఎలా ఇస్తుంది?
- ఆ ఫండ్‌ను ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్‌గా మార్చేశారు
- పాక్‌ను అణు నిరాయుధీకరణ చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి
హైదరాబాద్/బషీర్‌బాగ్, వెలుగు: ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తున్నదని, అమాయకులను , చిన్నపిల్లలను చంపుతూ ఇస్లామిక్ థియరీని తప్పిందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఇస్లాం పేరు ఎత్తడానికి కూడా పాకిస్తాన్‌కు అర్హత లేదని అన్నారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ‘తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో జరిగిన ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తో కలిసి ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పాకిస్తాన్ కు ఒక బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయడాన్ని తప్పుపట్టారు.‘‘గత 75 ఏండ్లుగా వాళ్లు ఏం చేశారు.. ఈ దుస్థితికి రావడానికి కారణం ఎవరు? అయినా దురదృష్టవశాత్తూ ఐఎంఎఫ్ వారికి బిలియన్ డాలర్ల రుణం ఇస్తున్నది. ఈ నిధులను పాకిస్తాన్ మిలిటెంట్ల తయారీకి వాడుతున్నది. అది అంతర్జాతీయ ద్రవ్య నిధి కాదు, దానిని అంతర్జాతీయ మిలిటెంట్ ఫండ్ గా మార్చేశారు” అని ఫైర్ అయ్యారు. మన భూభాగం, మన సైనికులు, మన ప్రజలపై దాడులు జరుగుతున్నా.. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌లాంటి దేశాలకు రుణం ఇవ్వడానికి ఎలా అంగీకరిస్తున్నాయని ప్రశ్నించారు.
పాకిస్తాన్ ఇప్పుడు అధికారికంగా బిచ్చగాళ్ల దేశం
అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థల వద్ద చేయిచాచడం ద్వారా పాకిస్తాన్ ఇప్పుడు అధికారికంగా ఒక బిచ్చగాళ్ల దేశంగా మారిందని ఒవైసీ ఎద్దేవా చేశారు. భారత్‌పై పాక్ దుందుడుకు చర్యలను తీవ్రంగా ఖండించారు. శత్రువుల దాడులను మన సైనికులు ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ‘‘శ్రీనగర్ వరకు పాకిస్తాన్ డ్రోన్లు వచ్చాయి. మన సైనికులు ఎంతో ధైర్యంతో వాటిని తిప్పికొట్టారు. సరిహద్దు ప్రజలు కూడా ధైర్యంగా నిలబడ్డారు. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తున్నది. పవిత్ర మాసంలో పహల్గాంలో అమాయకులను, దాడులతో చిన్నపిల్లలను చంపడం ద్వారా ఇస్లామిక్ థియరీని వదిలేసింది. పహల్గాం లో పాక్ ప్రేరిత టెర్రరిస్టులు కల్మా చదవని వారిని.. కుటుంబ సభ్యుల ముందే అతి కిరాతకంగా చంపేశారు. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ అబద్ధాలతో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని చూస్తున్నదని, కానీ వారి మాటలు నమ్మే స్థితిలో ఎవరూ లేరని అన్నారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు విభేదాలు పక్కనపెట్టి దేశ రక్షణ కోసం ఏకం కావాలని ఒవైసీ పిలుపునిచ్చారు. దేశ సైన్యానికి అండగా నిలవాలని జాతీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, సైనికులకు అండగా ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణు సామర్థ్యం ప్రపంచానికి ప్రమాదకరమని, దాన్ని నిరాయుధీకరించాలని ప్రపంచ దేశాలను ఒవైసీ విజ్ఞప్తిచేశారు. ‘‘భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ వాళ్లకు దేశాన్ని పాలించడం చేతకాలేదు.. ఆర్థిక వ్యవస్థను నడపడం తెలియలేదు.. ఇస్లాం గురించి మాట్లాడడం తప్ప వాళ్ల దగ్గర ఏమీ లేదు. భారత్‌లో హిందూ, -ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికే ఈ వ్యూహాలు పన్నుతున్నారు” అని మండిపడ్డారు.