హుజూరాబాద్​లో రౌడీ రాజ్యం.. దళితులపై  బీఆర్ఎస్ లీడర్ల దౌర్జన్యం

హుజూరాబాద్​లో రౌడీ రాజ్యం.. దళితులపై  బీఆర్ఎస్ లీడర్ల దౌర్జన్యం
  • హుజూరాబాద్​లో రౌడీ రాజ్యం
  • దళితులపై బీఆర్ఎస్ లీడర్ల దౌర్జన్యం
  • 2418 సర్వే నంబర్​లో భూములను పేదలకు పంచాలి 
  • సీపీఐ రాష్ట్ర నాయకుడు మర్రి వెంకటస్వామి

హుజూరాబాద్,  వెలుగు: కరీంనగర్​జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి.. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరినప్పటి నుంచి రౌడీ రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర నాయకుడు మర్రి వెంకటస్వామి ఆరోపించారు. శుక్రవారం వీ6 వెలుగు పత్రికలో ‘అసైన్డ్ భూములకు పట్టాలు పుట్టిచ్చిన్రు’ హెడ్డింగ్ తో పబ్లిష్ అయిన స్టోరీపై ఆయన స్పందించారు. ప్రెస్​క్లబ్​లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వెంకటస్వామి మాట్లాడుతూ హుజూరాబాద్ లో దళితులపై దౌర్జన్యాలు పెరిగాయని, అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి అండతో జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక భర్త శ్రీనివాస్ హుజూరాబాద్​లోని రూ.కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వందల మందిని తీసుకొచ్చి అసైన్డ్ భూముల్లో టెంట్ వేయించి, ప్రశ్నించిన వారిని భయపెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీను కూడా కబ్జాదారులకు అండగా ఉంటూ అరాచకాలను ప్రోత్సహిస్తునారన్నారు. ప్రభుత్వం ఎన్నో ఏండ్ల కింద దళితులకు ఇచ్చిన 2418 సర్వే నంబర్​లోని భూములను అమ్మారంటూ బీఆర్ఎస్ లీడర్లు అసైన్డ్ భూములను తమ పేర్లమీదకు మార్చుకుని రియల్ వెంచర్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సామాన్యులు అప్లికేషన్లు పెట్టుకుంటే నెలలు గడిచినా సర్వేకు రాని ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్లు.. బీఆర్ఎస్ లీడర్లు అడగ్గానే ఆగమేఘాల మీద వచ్చి హద్దులు పెడుతున్నారన్నారు. పోలీసులు కూడా నాయకులకు అండగా ఉండడం సిగ్గుచేటన్నారు. 2418 సర్వే నంబర్​లో  మోకా మీద ఉన్న దళితులకు హద్దులు పెట్టాలని, లేని వారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాడ్ చేశారు. ఈ అక్రమాలను మంత్రి గంగులతో పాటు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, స్థానిక ఎమ్మెల్సీ అండతో సాగుతున్న బీఆర్ఎస్ నాయకుల ఆరాచకాలపై అఖిల పక్షంతో కలిసి ఎదుర్కొంటామన్నారు. దళితుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలతో కలిసి తరమి కొడతామని హెచ్చరించారు. అఖిల పక్షనాయకులు సోల్లు బాబు, బొరగాల సారయ్య,  ఫయాజ్,  మారెపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, రఘుపతి, చంద్రయ్య, బాబు, సమ్మయ్య చంద్రయ్య పాల్గొన్నారు.