- మాస్టర్ మైండ్‌గా వ్యవహరించిన సైఫుల్లా
- ఐపీ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లతో కుట్ర బట్టబయలు
న్యూఢిల్లీ: పహల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ కేంద్రంగానే కుట్ర జరిగిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) తెలిపింది. లష్కరే, దాని ప్రాక్సీ సంస్థ టీఆర్‌ఎఫ్ కు చెందిన పాక్ హ్యాండ్లర్లు ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఎన్‌ఐఏ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
టెర్రరిస్టులకు, పాకిస్తాన్‌లోని వారి హ్యాండ్లర్లకు ఉన్న సంబంధాలను ఐపీ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లను ఎన్‌ఐఏ బహిర్గతం చేసింది. ఈ దాడుల వెనుక పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న లష్కరే, టీఆర్‌ఎఫ్ కమాండర్ సైఫుల్లా అలియాస్ సాజిద్ జట్ మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించాడని.. పాక్ నుంచే అతడు టెర్రరిస్టులకు రియల్ టైమ్‌లో దిశానిర్దేశం చేశాడని చార్జ్‌షీట్‌లో వెల్లడించింది.
తప్పుదోవ పట్టించేందుకే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్
పహల్గామ్ అటాక్‌ను భారత ప్రభుత్వమే ప్లాన్ చేసిందంటూ (ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్) అంతర్జాతీయంగా తప్పుడు ప్రచారం చేయడానికి టెర్రరిస్టులు ప్రయత్నించారని, ఆ కుట్రను కూడా తాము చార్జ్‌షీట్‌లో బట్టబయలు చేశామని ఎన్‌ఐఏ చెప్పింది. ముగ్గురు టెర్రరిస్టులు, పాక్ హ్యాండ్లర్లకు మధ్య ఉన్న సంబంధాలను స్పష్టం చేసే సాంకేతిక ఆధారాలను తాము సేకరించినట్టు వివరించింది.
ఈ కేసులో సైఫుల్లాను ఏ1గా పేర్కొంది. అతడు భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడని, అనేక దాడులకు వ్యూహాలు రచిస్తున్నాడని తెలిపింది.
