కోహ్లీకి పాక్ కెప్టెన్ మద్దతు

కోహ్లీకి పాక్ కెప్టెన్ మద్దతు

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. కెప్టెన్సీ కోల్పోయినప్పటి నుంచి కోహ్లీ పెద్దగా రాణించింది లేదు. తాజాగా ఇంగ్లాండ్ టూర్ లోనూ కోహ్లీ విఫలమవుతున్నాడు. ఐదో టెస్టులో ఘోరంగా విఫలమైన కోహ్లీ..టీ20ల్లోనూ రాణించలేదు. రెండు టీ20ల్లో కేవలం 12 పరుగులే చేశాడు. 

విమర్శల బాణాలు..
తొలి వన్డేలో గాయం కారణంగా ఆడని కోహ్లీ రెండో వన్డేలో మళ్లీ విఫలమయ్యాడు. 25 బంతుల్లో 3 ఫోర్లతో కేవలం 16 రన్స్ చేసి పెవీలియన్ చేరాడు. డేవిడ్ విల్లే బౌలింగ్ లో ఆఫ్ స్టంప్ అవతలి వైపు వెళ్తున్న బంతిని ఆడబోయి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ తరచూ ఫెయిలవుతుండటంతో మాజీలు, అభిమానులు అతనిపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. 

కపిల్ దేవ్ ఘాటు వ్యాఖ్యలు..
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఏకంగా విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలన్నాడు. అశ్విన్ విపలమైతే అతన్ని టెస్టుల నుంచి తప్పించినప్పుడు కోహ్లీని ఎందుకు తొలగించరని ప్రశ్నించాడు. అటు మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కూడా..సరిగా ఆడని ఆటగాళ్లను పక్కన పెట్టేయాలని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా కోహ్లీ ఫాంలోపై వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ రాణించకుంటే టీ20 వరల్డ్ కప్లో ఆడటం కష్టమే అన్నాడు.

కోహ్లీకి పాక్ కెప్టెన్ బాసట
ఓవైపు కోహ్లీపై విమర్శల దాడి పెరిగిపోతుంటే..పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ మాత్రం కోహ్లీకి బాసటగా నిలిచాడు. కోహ్లీకి అతను ఫుల్ సపోర్ట్ చేశాడు. ప్రతీ ఆటగాడి కెరియర్ లో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని..అందుకు కోహ్లీ అతీతం కాదన్నాడు. ఇలాంటి సమయంలోనే ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించాడు. త్వరలో విరాట్ ఫాంలోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మేరకు కోహ్లీతో దిగిన ఫోటోను ఆజమ్ ట్వీట్ చేశాడు. గురువారం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ కూడా కోహ్లీ అండగా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఫాంపై ఆందోళన అవసరం లేదని గంగూలీ అన్నాడు. అతను త్వరలోనే ఫాంలోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. అతని అంతర్జాతీయ కెరియర్లో సాధించిన రికార్డులు చూడాలని..అతనికి నైపుణ్యం, సామర్థ్యం ఉన్నాయన్నాడు. 

కోహ్లీకి  పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అండగా  నిలవడంపై అతని ఫ్యాన్స్ థాంక్స్ చెబుతున్నారు. ఆజమ్ క్రీడాస్పూర్తిని చాటుకున్నారని మెచ్చుకుంటున్నారు. దేశాలకు హద్దులున్నా..క్రీడలకు ఎలాంటి సరిహద్దులేవని విషయాన్ని బాబర్ నిరూపించారని ప్రశంసిస్తున్నారు.