ఆఫ్గన్ - పాకిస్తాన్ వన్డే సిరీస్ వాయిదా

ఆఫ్గన్ - పాకిస్తాన్ వన్డే సిరీస్ వాయిదా

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించాక ఆదేశ క్రికెట్ జట్టు పరిస్థితి అయోమయంగా తయారైంది. పలువురు క్రికెటర్లు తమ భద్రతపై సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారం చేపట్టిన తాలిబన్లు క్రికెట్ ఆటను కొనసాగించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. మీ ఆట మీరు ఆడుకోండి.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు భరోసా ఇచ్చారు. 
తొలుత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించి సిరీస్ తటస్థ వేదిక అయిన శ్రీలంకలో జరుగుతుంది కాబట్టి.. మ్యాచులకు ఎలాంటి ఢోకా లేదని.. సిరీస్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని ప్రకటించి ఆశ్చర్యపరచింది. పాక్ ప్రకటన వెలువడిన రెండు మూడు రోజులకే తాలిబన్లు కూడా క్రికెట్ కు ఎలాంటి అంతరాయం కలిగించబోమని ప్రకటించారు. తమ పాలనపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రజలు యధావిధిగా తమ కార్యక్రమాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు నిర్వహించుకోవచ్చని  భరోసా కల్పిస్తున్నట్లు నిన్న ప్రకటించారు. తటస్థ వేదిక శ్రీలంక నుంచి పాక్ కు మారినట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిరవధిక వాయిదా ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 1 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమై 3వ తేదీన రెండో వన్డే, 5వ తేదీన చివరి వన్డే జరగాల్సి ఉండగా.. నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.