IPL 2024: ఎట్టకేలకు సాధించాడు: కోహ్లీ దగ్గర నుంచి బ్యాట్ సంపాదించిన రింకూ సింగ్

IPL 2024: ఎట్టకేలకు సాధించాడు: కోహ్లీ దగ్గర నుంచి బ్యాట్ సంపాదించిన రింకూ సింగ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఒక్కసారి బ్యాట్ ను సంపాదించడమే కష్టం. కోహ్లీ చేతి నుంచి గిఫ్ట్ అందుకోవాలని ఎంతమందో యువ క్రికెటర్లు ఆరాటపడతారు. ప్రస్తుతం కోహ్లీని ఆదర్శంగా తీసుకొని క్రికెట్ లోకి ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లు వస్తున్నారు. వారిలో రింకూ సింగ్ ఒకరు. తనకిష్టమైన కోహ్లీ దగ్గర నుంచి రింకూ రెండుసార్లు బ్యాట్ ను అందుకున్నాడు.

మొదటిసారి కోహ్లీ ఇచ్చిన బ్యాట్ ను రింకూ విరగొట్టడంతో రెండోసారి విరాట్ బ్యాట్ ఇవ్వడానికి నిరాకరించాడు. అయితే ఎట్టకేలకు రింకూ కోరిక మేరకు కోహ్లీ మరోసారి తన దగ్గర ఉన్న బ్యాట్ ను గిఫ్ట్ గా బహూకరించాడు. దీంతో ఈ యువ బ్యాటర్ తెగ సంతోషంలో ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.           

అసలేం జరిగిందంటే..?   

మార్చి 29న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఆ  మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును చిత్తు చేసింది. ఆ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ త‌న దగ్గర ఉన్న బ్యాట్లలో ఒక దానిని కేకేఆర్ యువ బ్యాటర్ రింకూ సింగ్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చాడు. దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించాడు.

కానీ, సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే రింకూ ఆ బ్యాట్‌ను విరగ్గొట్టాడు. ఆదే విష‌యాన్ని కోహ్లీకి రింకూ వివ‌రించాడు. స్పిన్నర్‌ను ఎదుర్కొనేట‌ప్పుడు బ్యాట్ విరిగిపోయింద‌ని చెప్పాడు. అంతేకాదు, త‌న‌కు కొత్త బ్యాట్ ఇవ్వాల్సిందిగా కోహ్లీని అభ్యర్థించాడు. అయితే,  అతని అభ్యర్థనను విరాట్ అంగీకరించలేదు. మరొక బ్యాట్ ఇస్తే నువ్వే ఇబ్బంది ప‌డ‌తావు అంటూ అతనికి ఫ‌న్నీగా సమాధానమిచ్చాడు. వీరి మ‌ధ్య జరిగిన సంభాష‌ణను కోల్‌క‌తా యాజమాన్యం.. త‌మ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.