వరుణాచలం దగ్గర దగ్గర ఓ పాడుబడ్డ తోటలో ' ‘మందవిషుడు' అనే ఓ త్రాచుపాము ఉండేది. అది ముసలిదైపోయింది. దానికి వేటాడే శక్తి సన్నగిల్లింది. తినడానికి ఏమీ దొరికేది కాదు.
అప్పుడు అది మనసులో, 'శక్తితో సాధించలేనిది యుక్తితో సాధించాలి' అనుకుంది. చెరువు వద్ద సాధువులాగా పడుకునేది. ఏమీ తినదు. ఎవరినీ చూడదు. రోజంతా ధ్యానం చేస్తున్నట్లు నటించేది.. 'మహాభక్తురాలు కావొచ్చు ఈ పాము' అనుకున్నాయి చెరువులోని కప్పలు.
ఒకరోజు కప్పలకు రాజైన 'జపాదుడు' పాము దగ్గరికి వచ్చి, "ఎందుకీ తపస్సు. శుష్కించిపోతున్నావు" అని అంది..
"పూర్వం నేనొక మహానుభావుడి కొడుకుని కాటువేశాను. కోప్పడిన ఆ మనిషి నన్ను ఇలా శపించాడు. కప్పను మోస్తూ జీవింతువు గాక! అనేది ఆ శాపం" అని అమాయకంగా అన్నది పాము.
ఆ మాటలు నిజమేనని నమ్మిన కప్పలు.. అత్రాచుపాముని చుట్టుముట్టాయి. దానిపై ఆడుకోవడం మొదలుపెట్టాయి. వాటికి మెత్తటి పరుపులా ఉండేది పాము దేహం.
ఓరోజు ఇలాగే పాముపై కూర్చొని సరదాగా ఆడుకుంటున్న జపాదుడు... "ఇంతగా చిక్కిపోయావేమిటి?” అని పాముని అడిగింది.
“తిండిలేక చిక్కిపోయాను" అని దీనంగా సమాధానమిచ్చింది త్రాచుపాము.
"సరే అయితే! నేను రాజుగా చెప్తున్నాను. ఏవో చిన్న కప్పలను పట్టుకుని ఆకలి తీర్చుకో. భయపడాల్సిన పనిలేదు” అంది కప్పరాజు.
సంతోషించిన పాము ఒక్కొక్క కప్పను గుటకాయ స్వాహా చేస్తూ వచ్చింది. కొద్దికాంలోనే అది కప్పలనన్నింటిని హాయిగా తినేసింది. చివరకు కప్పరాజైన జపాదుడిని కూడా గుటకాయ స్వాహా చేసింది.
మూలం: విష్ణు శర్మ: పునః కథనం: అనిల్ బత్తుల
