పార్లమెంట్ లోనూ.. ఎన్‌కౌంటర్‌కి సై

పార్లమెంట్ లోనూ.. ఎన్‌కౌంటర్‌కి సై

ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామన్న ​కాంగ్రెస్ లీడర్ అధిర్ చౌదరి
ఉన్నావ్ ఘటనపైనా గరంగరం
మంత్రి స్మృతి వివరణను అడ్డుకున్న ప్రతిపక్ష ఎంపీలు.. వివాదం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, నిందితుల్ని శిక్షించే విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న జాప్యంపై శుక్రవారం పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దిశ కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపైనా రెండు సభల్లో చర్చ జరిగింది. పార్టీలకు అతీతంగా మెజార్టీ ఎంపీలు.. తెలంగాణ పోలీసుల చర్యను సమర్థించారు. లోక్ సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి.. దిశ అంశాన్ని, ఉన్నావ్​లో రేప్ బాధితురాలిపై హత్యాయత్నం ఘటనను ప్రస్తావించారు. ఉన్నావ్​ ఘటనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆవేదన వ్యక్తంచేశారు. ఆమెను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకోవడంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. మహిళలపై అత్యాచారాలు అంశంపై రాజ్యసభలో కూడా ప్రతిపక్షాలు
ఆందోళనకు దిగాయి.

రాముడికి గుడి.. సీతకు నిప్పు!
దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, రేపిస్టులను శిక్షించేందుకు చట్టాలున్నా ప్రభుత్వాలు వాటిని సరిగా అమలు చేయడంలేదని లోక్ సభలో కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధురి అన్నారు. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో చోటుచేసుకున్న దిశ ఘటనలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును ప్రస్తావించిన ఆయన.. ఎన్‌కౌంటర్‌ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నదని చెప్పా రు. కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్​లో రేప్ బాధితురాలు కోర్టుకు వెళుతుండగా అదే కేసులో నిందితులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై చౌదురి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యూపీలో ఒకవైపు శ్రీరాముడికి గుడి కడుతున్నాం అంటూనే సీతమ్మతల్లులకు నిప్పు పెడుతున్నారు. బీజేపీ హయాంలో మహిళలకు భద్రత లేదు. తెలంగాణలో చేసినట్లే ఉన్నావ్‌ కేసులోనూ నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి” అని కాంగ్రెస్ ఎంపీలు నినదించారు. ఉన్నావ్​ ఘటనపై సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది.

స్మృతిని బెదిరించిన ఎంపీలకు నోటీసులు
ఉన్నావ్​ రేప్ బాధితురాలి హత్యాయత్నం ఘటనపై లోక్ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ‘‘వెంటనే చర్యలకు ఆదేశించకుండా ఇంకెంతకాలం వివరణలు ఇస్తారు? మీకు మాట్లాడే హక్కులేదు కూర్చోండి..’’అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు.. మంత్రి స్మృతిని బెదిరిస్తున్నట్లుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. మహిళల అంశంపై మాట్లాడుతున్న సమయంలోనే మహిళా మంత్రిపై ఈ రకమైన బెదిరింపులకు దిగడం సరికాదని ప్రతిపక్షాలపై బీజేపీ ఎంపీలు ఫైరయ్యారు. సభలో మాట్లాడనీయకుండా తనను బెదిరించిన ఇద్దరు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి స్మృతి లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. రూల్ నంబర్ 374 ప్రకారం ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలకు నోటీసులు జారీచేశారు. దీనిపై సోమవారం మళ్లీ మాట్లాడుతానని స్మృతి చెప్పా రు. నాలుగురోజుల కిందట కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేసిన టైమ్‌లో వారిని మార్షల్ బలవంతంగా బయటికి పంపడం, మార్షల్స్ తమపై దాడి చేశారని ఇద్దరు
మహిళా కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించడం తెలిసింది.

రాజ్యసభలో..
మరోవైపు రాజ్యసభలోనూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్, ఉన్నావ్​ ఘటనలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. నిర్భయ నిందితులకు శిక్ష పడి ఏడేళ్లు గడుస్తున్నా.. ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడం లేదంటూ కేంద్రాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. దేశంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని, కఠిన శిక్షలు పడేలా చట్టాలను మార్చాలని డిమాండ్ చేశాయి.