- 2024 నీట్ యూజీ అక్రమాలపై విచారణ జరిపారా?
న్యూఢిల్లీ: నీట్ యూజీ ఎగ్జాంలలో 2028 నుంచి పేపర్ లీక్ ఘటనలు ఏవైనా జరిగాయా? నీట్ ఎగ్జాంలలో అక్రమాలు జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలపై విచారణలు ఏమైనా చేశారా? అసలు పేపర్ లీక్ అంటే ఉన్న నిర్వచనం ఏమిటి? అంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నలు సంధించింది.
వీటన్నింటిపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఆన్ -స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్(ఓఎస్ఎం) వివాదంపై రిపోర్ట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)కి సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని విద్య, మహిళా, శశు, యువజన, క్రీడలపై నియమితమైన పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్ -స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ వివాదంపై దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఎన్టీఏ, సీబీఎస్ఈ, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిచి కమిటీ విచారించింది. తమ వ్యవస్థ నుంచి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని, ఒక గెస్ పేపర్‌కు చెందిన కొన్ని ప్రశ్నలు మాత్రమే చలామణిలో ఉన్నాయని ఆ సమావేశంలో అధికారులు వాదించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. నీట్-యూజీ 2024 పేపర్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై (సీబీఐ దర్యాప్తు కాకుండా) ఎన్టీఏ సొంతంగా విచారణ జరిపిందా? అని కూడా కమిటీ ప్రశ్నించింది.
గత మూడు సంవత్సరాలుగా ఎన్టీఏ సిబ్బంది ఎంత మంది ఉన్నారు.. 2022 నుంచి చేసిన కొత్త నియామకాల వివరాలను కూడా అడిగింది. గత మూడు సంవత్సరాలుగా ఉన్నత విద్యా శాఖకు ఎన్టీఏ సమర్పించిన వార్షిక నివేదికను కూడా కోరింది. ఎన్టీఏ నిర్మాణం, పనితీరు, పరీక్షల ప్రక్రియలో సంస్కరణలు, డేటా భద్రతా ప్రోటోకాల్ మెరుగుదలతో సహా ఎన్టీఏ ద్వారా పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా సిఫార్సులు చేయడానికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో 2024లో ఏర్పాటైన కమిటీ సిఫార్సులపై ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి కూడా వివరించాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది. వీటన్నింటిపై సమాధానాలు ఇచ్చేందుకు సీబీఎస్ఈకి జూన్ 8 వరకు, ఎన్టీఏకు జూన్ 10 వరకు గడువు ఇచ్చినట్టుగా అధికారిక వర్గాలు తెలిపాయి.
