- మేయర్ విజయలక్ష్మి, కమిషనర్‌ను కోరిన కార్పొరేటర్ కుమార్‌యాదవ్
అమీన్పూర్, వెలుగు: పటాన్చెరు, అమీన్పూర్, తెల్లాపూర్, జీహెచ్ఎంసీ వార్డులను పునర్విభజన చేయాలని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కోరారు.
మంగళవారం మేయర్ అధ్యక్షతన జరిగిన 27 యూఎల్బీల విలీనం, మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల విభజన, వార్డుల పునర్విభజన ప్రక్రియ అభ్యంతరాలపై నిర్వహించిన సమావేశంలో కుమార్ యాదవ్ పలు అంశాలను ప్రస్తావించారు. అమీన్పూర్ పట్టణ పరిధిలో లక్షా 25వేల జనాభా ఉండగా అమీన్పూర్, సుల్తాన్పూర్ పేరుతో రెండు డివిజన్లు మాత్రమే చేశారని, జనాభా ప్రాతిపాదికన డివిజన్ల సంఖ్య పెంచాలన్నారు.
తెల్లాపూర్‌లో కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో లక్ష పైచిలుకు ఓటర్లు ఉన్నారని, ఇక్కడ తెల్లాపూర్, ముత్తంగి పేరుతో రెండు డివిజన్లు మాత్రమే చేశారని, దీని వల్ల పరిపాలన ఇబ్బందిగా మారుతుందన్నారు. పటాన్చెరులో జేపీ కాలనీకి బదులుగా బండ్లగూడ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నట్లు సమావేశంలో వివరించారు. బొల్లారం డివిజన్‌ను కూకట్పల్లి జోన్లో కాకుండా శేరిలింగంపల్లి జోన్లో కలపాలని కోరారు.
నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయండి
పరిపాలన సౌలభ్యం కోసం అమీన్పూర్ను నాలుగు జీహెచ్ఎంసీ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీసులో, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ఆఫీసులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులతో వినతిపత్రాలను అందజేశారు.
అమీన్పూర్లో దాదాపు లక్షా ఇరవై వేల జనాభా ఉందని, రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందన్నారు. బీరంగూడ ఆలయ చైర్మన్ సుధాకర్‌యాదవ్, నాయకులు మున్నా, మహేశ్, నవీన్, రవీందర్, సత్తన్న, చంద్రశేఖర్, మహేశ్‌గౌడ్, నరేశ్‌యాదవ్, మల్లేశ్‌యాదవ్, దీపక్‌గౌడ్, రాజు, శ్రీనివాస్, ప్రకాశ్, రాఘవ్, వల్లభ పాల్గొన్నారు.
