యెస్ బ్యాంక్‌‌లో వాటాలు పేటీఎం చేతికి..

యెస్ బ్యాంక్‌‌లో వాటాలు పేటీఎం చేతికి..

    తుది దశకు చేరుకుంటున్న డీల్

    పేటీఎంతో రాణా కపూర్ చర్చలు

    9.64 శాతం వాటాలమ్మేందుకు సిద్ధం

    పేటీఎంకి భారీగా పెరుగుతున్న నష్టాలు

 

న్యూఢిల్లీ : యెస్ బ్యాంక్‌‌లోని వాటాలను విజయ్ శేఖర్ శర్మకు అమ్మేందుకు రాణా కపూర్ చూస్తున్నారు. బ్యాంక్‌‌ వాటాల అమ్మకంపై పేటీఎంతో రాణా కపూర్ చర్చిస్తున్నట్టు తెలిసింది. యెస్‌‌ బ్యాంక్‌‌లోని మైనార్టీ వాటాలను ఒక టెక్నాలజీ కంపెనీకి అమ్మేందుకు చర్చలు జరుగుతున్నట్టు బ్యాంక్‌‌ సీఈవో రవ్​నీత్ గిల్‌‌ కూడా ధృవీకరించారు. దీంతో ఈ ప్రైవేట్ బ్యాంక్‌‌ క్యాపిటల్‌‌ను మరింత పెంచనున్నామని చెప్పారు. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. డీల్‌‌ కూడా ఓకే అయ్యేందుకు దగ్గర్లో ఉందని తెలిపారు. వాటాల అమ్మకం తొలుత 10 శాతం కంటే తక్కువగా ఉంటుందని, ఆ తర్వాత ఇది పెరుగుతుందని తెలిపారు. వాటాలు కొనేవారు ప్రపంచంలో టాప్ త్రీ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటని వెల్లడించారు. ఇది అంతకుముందు బ్యాంక్‌‌లో ఇన్వెస్ట్ చేయలేదని కూడా పేర్కొన్నారు. అయితే ఆ ఇన్వెస్టర్ పేరును గిల్ రివీల్ చేయలేదు.

ఆగస్ట్‌‌లోనే యెస్‌‌ బ్యాంక్‌‌లోని ఆయన వాటాలను, తన ఫ్యామిలీ వాటాలను రూ.1,800 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు కొనాలని విజయ్‌‌ను రాణా కపూర్ కోరారు. ప్రస్తుతం ఈ డీల్ ధరపై చర్చలు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కపూర్‌‌‌‌కు, ఆయన కుటుంబ సభ్యులకు, ఇన్వెస్ట్‌‌మెంట్ సంస్థలకు యెస్ బ్యాంక్‌‌లో 9.64 శాతం వాటాలున్నాయి. యెస్ బ్యాంక్‌‌ షేర్లు సోమవారం 4.5 శాతం పెరిగి రూ.63.10 వద్ద క్లోజయ్యాయి. కపూర్,ఆయన కుటుంబ సభ్యుల వాటా ప్రస్తుత విలువ రూ.1,550 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఈ విషయంపై విజయ్ శేఖర్ శర్మ కానీ, కపూర్‌‌‌‌ కానీ స్పందించడం లేదు.

కపూర్ ఫ్యామిలీ యెస్‌‌ బ్యాంక్‌‌లో వాటాలను డైరెక్ట్‌‌గా, ఇన్వెస్ట్‌‌మెంట్ సంస్థ యెస్ బ్యాంక్, మోర్గాన్ క్రెడిట్ల ద్వారా కలిగి ఉంది. ఆయన కూతుర్లు రాఖీ, రోషిని, రాధా ఇన్వెస్ట్‌‌మెంట్ కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ డీల్‌‌లో లాభ నష్టాలను విజయ్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.  బ్యాంక్‌‌ క్యాపిటల్‌‌ను మరింత పెంచుకునేందుకు యెస్ బ్యాంక్ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. బ్యాంక్‌‌ 130 కోట్ల డాలర్ల నిధులు సేకరించేందుకు అంగీకరించింది. వాటిలో 100 కోట్ల డాలర్ల నుంచి 120 కోట్ల డాలర్ల వరకు ప్రిఫరెన్షియల్ అలాట్‌‌మెంట్ ద్వారా సేకరిస్తున్నారు. ఆర్‌‌‌‌బీఐ నిబంధనల ప్రకారం, ఒక ఇండివిడ్యువల్ షేర్‌‌‌‌హోల్డర్ బ్యాంక్‌‌లో 15 శాతాని కంటే ఎక్కువ వాటాలు ఉండటానికి వీలు లేదు. వాటాలు కొనే వ్యక్తే కాకుండా.. చిన్న ఇన్వెస్టర్లు కూడా 20 కోట్ల డాలర్ల నుంచి 25 కోట్ల డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు.