ప్రభుత్వ అభివృద్ధిని, పార్టీ వైఖరిని జనంలోకి తీసుకెళ్లాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ప్రభుత్వ అభివృద్ధిని, పార్టీ వైఖరిని జనంలోకి తీసుకెళ్లాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన పీసీసీ అధికార ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ వైఖరిని స్పష్టంగా జనంలోకి తీసుకెళ్లాలని, టీవీ మీడియా చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇటు ప్రభుత్వంపై, అటు పార్టీపై  బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న విష ప్రచారాన్ని ఆధారాలతో గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వ విజయాలను, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు వివరించాలన్నారు. పీసీసీ అధికార ప్రతినిధులు పార్టీకి బలమైన గొంతుకగా నిలవాలని మహేశ్ గౌడ్ సూచించారు. సమావేశంలో పలువురు పీసీసీ అధికార ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.