- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్
- బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం డ్రగ్స్‌మయం .. కేటీఆర్‌వి అన్నీ ఉల్టా చోర్ మాటలే
- వచ్చే అసెంబ్లీలో 51 మంది మహిళా ఎమ్మెల్యేలే లక్ష్యం
- రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతల స్వీకరణ.. హాజరైన అల్కా లాంబ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణను డ్రగ్స్, గంజాయి, కొకైన్ మయంగా మార్చారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇప్పుడు డ్రగ్స్ కంట్రోల్ చేస్తుంటే కేటీఆర్ సిగ్గులేకుండా ఉల్టా చోర్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలని కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం గాంధీ భవన్‌లోని ప్రకాశం హాల్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతా రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణకు మహేశ్‌కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్, ఆయన అనుచరుల తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘రాబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం డ్రగ్స్ పరీక్షలు చేయించుకుందాం.. కేటీఆర్ వస్తారా?’’ అని సవాల్ విసిరారు.
డ్రగ్స్‌రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఈగల్ బృందం తన కర్తవ్యాన్ని నిర్వర్తించిందని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, తప్పుచేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. కేటీఆర్ తప్పు చేసి ఇప్పుడు ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్‌తోనే మహిళా సాధికారత: ఎంపీ కావ్య
కాంగ్రెస్ పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. మహిళలు రాజకీయాలు, సామాజిక రంగాల్లో మరింత చురుగ్గా పాల్గొనేలా మహిళా కాంగ్రెస్ కీలక వేదికగా నిలుస్తున్నదని చెప్పారు. ఎర్రబెల్లి స్వర్ణ నాయకత్వంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని, మహిళల సమస్యల పరిష్కారానికి బలమైన స్వరం అవుతుందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళలను సంఘటితం చేసి పార్టీని మరింత బలపర్చడంలో మహిళా కాంగ్రెస్ ముందుండాలని సూచించారు.
మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ ఇన్‌చార్జి హర్కర వేణుగోపాల్ రావు, ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ నాయకులు గుండు సుధారాణి, కోట నీలిమ, నేరెళ్ల శారద తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ మహిళా పక్షపాతే..
కాంగ్రెస్ ఎప్పుడూ మహిళా పక్షపాతేనని, మహిళలను రాష్ట్రపతి, గవర్నర్లు, స్పీకర్లు, ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత ఒక్క తమ పార్టీకే దక్కుతుందని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పటికే పెద్ద ఎత్తున డైరెక్టర్ పదవులు ఇచ్చామని, ఆరుగురు మహిళలకు డీసీసీ అధ్యక్ష పదవులు కేటాయించామని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో 51 మంది మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇచ్చే నామినేటెడ్, చైర్మన్ పదవుల్లో 20 శాతం మహిళలకే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు పోటీ చేసేందుకు సమాన అవకాశాలు కల్పించామని చెప్పారు. రాహుల్ గాంధీ ఆశయాలకు తగ్గట్టుగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నదని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎర్రబెల్లి స్వర్ణ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి పనులు, పథకాలను మహిళా కార్యకర్తలు గడప గడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దాదాపు 30 ఏండ్ల తర్వాత అల్కా లాంబతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
