దుబ్బాకలో గెలిచి చరిత్ర సృష్టిస్తాం

దుబ్బాకలో గెలిచి చరిత్ర సృష్టిస్తాం

హైదరాబాద్: దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి చరిత్ర సృష్టిస్తామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 30వ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా చార్మినార్ దగ్గర సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్ని ఉత్తమ్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పీసీసీ చీఫ్ గా రాజీవ్ గాంధీ సద్భావన యాత్రలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు.  చైనాను మించి మొబైల్ కనెక్టివిటీ  భారత్ దేశంలో ఉందంటే దానికి రాజీవ్ గాంధీనే కారణం అన్నారు.

ప్రస్తుత పాలకులు మతం పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని..లౌకిక పార్టీగా దేశ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ లో కుల, మత  విభేదాలు ఉండవన్న ఆయన సామాజిక న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. అధికార TRS పార్టీ కమిషన్ల కోసమే పని చేస్తోందని..ప్రజలకోసం కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నందుకు గర్వపడాలన్నారు ఉత్తమ్.